ఇక ఫేస్‌బుక్ ను మరిచిపోండి..కొత్త పేరు ప్రకటించిన మార్క్ జూకర్‌బర్గ్

Forget Facebook now .. Mark Zuckerberg has announced a new name

0
125

అనుకున్నదే జరిగింది. కొంతకాలంగా జరుగుతున్న ప్రచారం నిజమైంది. ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఫేస్‌బుక్ పేరు మారింది. ఇదే విషయాన్ని ఫేస్‌బుక్ సీఈఓ మార్క్ జూకర్ బర్గ్ స్వయంగా వెల్లడించారు. ఫేస్‌బుక్ కంపెనీ పేరును మెటా గా మారుస్తున్నట్లు ప్రకటించారు. కంపెనీ వార్షిక సదస్సులో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. అయితే ఫేస్‌బుక్‌తో పాటు కంపెనీకి చెందిన ఇతర సామాజిక మాధ్యమాలు ఇన్‌స్టాగ్రాం, మెసేంజర్‌, వాట్సాప్‌ పేర్లలో ఎలాంటి మార్పు ఉండబోదని కంపెనీ తెలిపింది. ఫేస్‌బుక్‌కు చెందిన అన్ని కంపెనీలకు ‘మెటా’ మాతృసంస్థగా ఉండబోతుందని వెల్లడించారు.

మెటా వర్స్ అంటే ప్రజలు కలుసుకునే వర్చువల్ రియాలిటీ స్పేస్ అని అర్థం. దీనికి సంబంధించిన కొత్తలోగోను గురువారం కంపెనీ కనెక్ట్ ఈవెంట్‌లో ఆవిష్కరించారు. గత కొంత కాలంగా ఫేస్‌బుక్ వ్యక్తిగత ప్రయోజనాలు లక్ష్యంగా యూజర్ డేటాను ట్రాక్‌ చేస్తుందన్న ఆరోపణలు వెల్లువెత్తున్నాయి. ఈ నేపథ్యంలో అమెరికా సహా పలు దేశాల్లో ఫేస్‌బుక్ న్యాయపరమైన చిక్కులను ఎదుర్కొంటోంది. దీంతో ఫేస్‌బుక్ పేరు తరచుగా వార్తల్లో రావడం యూజర్లపై ప్రభావం చూపిస్తోందని కంపెనీ భావిస్తోంది.

ఈ నేపథ్యంలో ఫేస్‌బుక్‌కి చెందిన అన్ని కంపెనీలను ఒకే కొత్త కంపెనీ కిందకు తీసుకురావాలని కంపెనీ నిర్ణయించింది. అందులోభాగంగానే ఫేస్‌బుక్ పేరును ‘మెటా’గా మారుస్తున్నట్లు ప్రకటించారు. కాగా, ప్రైవసీ, సేవల్లో అంతరాయాలు వంటి అంశాలపై ఫేస్‌బుక్ తీవ్ర విమర్శలపాలైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కంపెనీపై వస్తున్న ఆరోపణలు, కంపెనీ ఎదుర్కొంటున్న వివాదాలపై ప్రజల దృష్టి మరల్చే ప్రయత్నం చేస్తున్నారని టెక్ విశ్లేషకులు అంటున్నారు.