ప్రముఖ సోషల్ మీడియా సంస్థ ఫేస్‌బుక్ సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ “ఫేస్‌బుక్, మెసెంజర్, ఇనస్టాగ్రామ్, వాట్సాప్” మాతృ సంస్థ పేరును ఫేస్ బుక్ నుంచి మెటాగా మార్చిన సంగతి మనకు తెలిసిందే. ఇక పై నుంచి ఈ యాప్స్ మాతృ సంస్థను మెటాగా వ్యవహరించాల్సి ఉంటుందని జుకర్‌బర్గ్ కంపెనీ కనెక్ట్ ఈవెంట్‌లో ప్రకటించారు. ఈ మేరకు జుకర్‌బర్గ్ కనెక్ట్ ఈవెంట్‌లో తన కంపెనీ కొత్త పేరు, లోగోను ప్రకటించారు. నిజానికి చెప్పాలంటే పూర్తి పేరు మెటావర్స్. దీనిని సంక్షిప్తంగా మెటా అని నామకరణం చేశారు. గ్రీకు భాషలో ‘మెటా’ అంటే “అంతకు మించి” అని అర్ధం.
అయితే, ఫేస్‌బుక్ పేరు మార్పు విషయంలో చాలా మంది తప్పుగా అర్ధం చేసుకుంటున్నారు. ఇక నుంచి ఫేస్ బుక్ పేరు మెటాగా మారనున్నట్లు అర్ధం చేసుకుంటున్నారు. కానీ, అది వాస్తవం కాదు. ఇప్పటి వరకు “ఫేస్‌బుక్, మెసెంజర్, ఇనస్టాగ్రామ్, వాట్సాప్” అన్నీ యాప్స్ కి కలిపి మాతృ సంస్థగా ఫేస్‌బుక్ కొనసాగుతూ వచ్చింది. ఇప్పుడు ఆ మాతృ సంస్థ పేరును “మెటా”గా జుకర్‌బర్గ్ ప్రకటించారు. అంటే ఇకపై మెటా మాతృ సంస్థ కింద ఫేస్‌బుక్, మెసెంజర్, ఇనస్టాగ్రామ్, వాట్సాప్ యాప్స్ ఉంటాయన్నమాట.
భవిష్యత్తులో మన సంస్థ ఏం చేయబోతోందనే విషయాన్ని ఫేస్‌బుక్ అనే పదంతో నిర్వచించలేం. మన విస్తరణకు ఆ పదం చాలా చిన్నదైపోయింది. కొత్త పేరు ఫేస్‌బుక్ యాప్స్ అన్నింటినీ రిప్రజెంట్ చేస్తుంది. రాబోయే రోజుల్లో సంస్థ భారీ ఎత్తున చేపట్టబోయే ఆగ్యుమెంట్, వర్చువల్ రియాలటీకి ప్రతిబింబంగా ఈ మెటా నిలుస్తుంది. మనం ఎవరు, మనం భవిష్యత్తులో ఏం నిర్మించాలనుకుంటున్నాం అనేది మెటా మీనింగ్” అని అన్నారు. అయితే మరోవైపు ఈ పేరు మార్పు వెనక ఇతర కారణాలున్నాయని చెబుతున్నారు. గత కొంత కాలంగా ఫేస్‌బుక్ వివాదాలు ఎదుర్కొంటోంది. మరో వైపు ప్రైవసీ పాలసీ విషయంలో దుమారం రేగింది. వీటన్నింటి నుంచి యూజర్ల దృష్టి మారాల్చడానికి మాతృ సంస్థ పేరు మార్చేయడమే ఉత్తమమని జుకర్‌బర్గ్ భావించినట్లు సైబర్ నిపుణులు చెబుతున్నారు.