ఆర్బీఐ కొత్త రూల్స్‌..ఆన్‌లైన్‌ కార్డు లావాదేవీలపై కొత్త నిబంధనలు ఇవే..

RBI New Rules ... New Rules on Online Card Transactions ..

0
100

ఆన్‌లైన్‌ కార్డు లావాదేవీలపై ఆర్బీఐ కొత్త నిబంధనలు అమల్లోకి వస్తున్నాయి. వినియోగదారుల భద్రతే లక్ష్యంగా గతేడాది మార్చిలో కస్టమర్ల కార్డు వివరాలను సేవ్‌ చేసుకోకుండా వ్యాపారులను నియంత్రిస్తూ ఆర్బీఐ మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ నిబంధనలు జనవరి 1 2022 నుండి అమలులోకి రానున్నాయి.

ఈ ఏడాది సెప్టెంబర్‌లో కార్డు టోకనైజేషన్‌ సర్వీసులపైనా మార్గదర్శకాలను విడుదల చేసింది. వినియోగదారుల సమ్మతితోనే కార్డు డాటా టోకనైజేషన్‌ విజయవంతం కాగలదని అందులో పేర్కొన్నది. యూనిక్‌ ఆల్గరిథమ్‌ జెనరేటెడ్‌ కోడ్‌తో కార్డు వివరాలను రీప్లేస్‌ చేసేందుకు టోకనైజేషన్‌ సహకరిస్తుంది. ఈ మార్గదర్శకాలన్నీ వచ్చే ఏడాది నుంచి వర్తించనున్నాయి. ఫలితంగా ఆన్‌లైన్‌ కార్డు లావాదేవీలపై కొత్త రూల్స్‌ రానున్నాయి. వీటి ప్రకారం..

జనవరి 1 నుంచి ఏ ఈ-కామర్స్‌ ప్లాట్‌ఫామ్‌పైనా..కస్టమర్లు తమ డెబిట్‌ లేదా క్రెడిట్‌ కార్డు వివరాలను సేవ్‌ చేసుకోలేరు.

ఆన్‌లైన్‌ లావాదేవీ జరిపిన ప్రతీసారి తమ కార్డు వివరాలను కస్టమర్లు ఎంటర్‌ చేయాల్సి ఉంటుంది.

ఈ ప్రక్రియ ఇబ్బందిగా ఉందనుకుంటే.. తమ కార్డులను టోకనైజ్‌ చేయవచ్చని ఈ-కామర్స్‌ సంస్థలకు కస్టమర్లు అంగీకారం తెలపాల్సి ఉంటుంది. ఆ తర్వాత అదనపు ఫ్యాక్టర్‌ అథెంటికేషన్‌ (ఏఎఫ్‌ఏ)తో కస్టమర్‌ కార్డు వివరాలను సదరు కార్డు నెట్‌వర్క్‌ సంస్థను అడిగి ఈ-కామర్స్‌ కంపెనీలు పొందుతాయి.

ఒక్కసారి ఈ-కామర్స్‌ సంస్థ.. కార్డు వివరాలను అందుకుంటే, ఆపై కస్టమర్లు తమ తదుపరి లావాదేవీల కోసం సదరు కార్డు వివరాలను ఆ ఈ-కామర్స్‌ వేదికపై సేవ్‌ చేసుకోవచ్చు.

ప్రస్తుతం మాస్టర్‌కార్డ్‌, వీసా మాత్రమే తమ కస్టమర్ల కార్డుల టోకనైజేషన్‌కు ఈ-కామర్స్‌ సంస్థలను అనుమతిస్తున్నాయి. ఆర్బీఐ కొత్త నిబంధనల నేపథ్యంలో మరిన్ని కార్డు సంస్థలూ టోకనైజేషన్‌ను అంగీకరించే వీలున్నది.

ఆర్బీఐ కొత్త రూల్స్‌ అంతర్జాతీయ లావాదేవీలకు వర్తించవు. దేశీయ కార్డులు, లావాదేవీలకు మాత్రమే వర్తిస్తాయి.

ఆర్బీఐ కొత్త మార్గదర్శకాలను అటు క్రెడిట్‌, ఇటు డెబిట్‌ కార్డుల సంస్థలు పాటించాల్సిందే.