భారత్‌లో రెండో ముంబై..ఎక్కడో తెలుసా?

0
98

బంగారు వ్యాపారంలో మన దేశంలో ముంబైదే అగ్రస్థానం. ముంబై తర్వాత పసిడి వ్యాపారం ఎక్కువగా జరిగే ప్రాంతం ఏపీలోని ప్రొద్దుటూరు. అందుకే ప్రొద్దుటూరును సెకండ్‌ ముంబై, పసిడిపురిగా పిలుస్తారు. ప్రొద్దుటూరు బంగారమంటే ఇష్టపడని వారుండరు. ఎందుకంటే ఇక్కడ కల్తీకి ఏమాత్రం ఆస్కారం ఉండదు. నాణ్యత, తూకంలో తేడా కనిపించదు. ఖచ్చితమైన ధర ఉంటుంది. కోరిన డిజైన్‌లో నగలు తయారు చేసే అద్భుత ప్రతిభ కలిగిన స్వర్ణకారులు ఇక్కడ కోకొల్లలు. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం కావాలంటే వైఎస్సార్‌ జిల్లాలోని ప్రొద్దుటూరుకు రావాల్సిందే. ఇక్కడి బంగారు వ్యాపారానికి వందేళ్ల చరిత్ర ఉంది.

1968లో అప్పటి ప్రభుత్వం గోల్డ్‌ కంట్రోల్‌ యాక్ట్‌ను తీసుకొచ్చింది. ఈ యాక్ట్‌ ప్రకారం దేశంలో లైసెన్సు లేకుండా బంగారు దుకాణాలు నిర్వహించడం నేరం. అప్పట్లో  ఈ చట్టాన్ని కఠినంగా అమలు చేశారు. దీంతో రాయలసీమలోని ఇతర ప్రాంత బంగారు వ్యాపారులు ప్రొద్దుటూరుపై ఆధారపడేవారు. ఇక్కడి నుంచి బంగారు కొనుగోలు చేసి వారి ప్రాంతాల్లో విక్రయించేవారు. నాటి భారత ప్రభుత్వం బంగారాన్ని టెండర్ల ద్వారా విక్రయించేది.

ఈ టెండర్లలో పాల్గొన్న ప్రొద్దుటూరు వర్తకులు 90 శాతం బంగారాన్ని దక్కించుకున్నారు. పెద్ద మొత్తంలో బంగారాన్ని దక్కించుకోవడంతో దేశమంతా ప్రొద్దుటూరు వైపు చూసింది. ఆ రోజు నుంచి రెండో ముంబైగా, పసిడిపురిగా ప్రొద్దుటూరును పిలుస్తారు. ముంబై, బెంగళూరు, చెన్నై మహానగరాలకు ధీటుగా ఇక్కడ పసిడి విక్రయాలు జరుగుతున్నాయి.