షాకింగ్- రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ బైక్‌లో లోపాలు..26,300 బైకులు వెనక్కి..!

Shocking - Defects in Royal Enfield bike..26,300 bikes back ..!

0
71

భారత్‌లో అత్యంత పాపులారిటీ సంపాదించుకున్న బైకుల్లో రాయల్‌ ఎన్‌ఫీల్డ్ ఒకటి. బుల్లెట్ బైక్ ఎక్కి షికార్లు కొట్టాలని చాలామంది యువత ఇష్టపడతారు. అందుకు తగినట్లుగానే రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ క్లాసిక్‌ 350 మోడల్‌ను సెప్టెంబర్‌లో విడుదల చేసింది. అయితే ఈ బైక్‌లను లక్ష యూనిట్లకుపైగా తయారు చేసింది కంపెనీ.

కానీ వెనుక బ్రేక్‌లో సమస్య కారణంగా.. రాయల్ ఎన్‌ఫీల్డ్ తన ‘క్లాసిక్ 350’ మోడల్‌కు చెందిన 26,300 వాహనాలను రీకాల్ చేసింది. ఈ మేరకు సోమవారం సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ (సియామ్‌), రోడ్డు రవాణా, రహదారులశాఖకు సమాచారం అందించింది.

అత్యవసర సమయాల్లో వెనుక బ్రేక్ పెడల్‌ను గట్టిగా నొక్కినప్పుడు రెస్పాన్స్‌ బ్రాకెట్‌ దెబ్బతినే అవకాశం ఉండటం, పైగా శబ్దం వెలువడటం, బ్రేకింగ్ సామర్థ్యం కూడా తగ్గిపోయే ప్రమాదం ఉన్నందున వాటిని రీకాల్‌ చేసినట్లు సంస్థ వెల్లడించింది. రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌లో అత్యధికంగా అమ్ముడయ్యేవి క్లాసిక్‌ 350 మోడల్‌ బైక్‌లే.

ఈ ఏడాది సెప్టెంబర్ 1 నుంచి డిసెంబర్ 5 మధ్య తయారైన సింగిల్-ఛానల్ ఏబీఎస్‌, రియర్‌ డ్రమ్ బ్రేక్ క్లాసిక్ 350 బైక్‌లలో మాత్రమే ఈ సమస్య ఉన్నట్లు సంస్థ వివరించింది. వెహికల్ ఐడెంటిఫికేషన్ నంబర్(వీఐఎన్‌) ఆధారంగా సర్వీస్‌ బృందాలు, స్థానిక డీలర్లు సంబంధిత వినియోగదారులను సంప్రదిస్తారని చెప్పింది. ‘డెవలప్‌మెంట్‌, టెస్టింగ్, నాణ్యత, మన్నిక విషయంలో అంతర్జాతీయ ప్రమాణాలకు కట్టుబడి ఉన్నాం. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఇలాంటి సమస్యలు తలెత్తొచ్చు. వీటిని పరిష్కరించేందుకు సిద్ధంగా ఉన్నాం’ అని సంస్థ తెలిపింది.