ప్రస్తుత రోజుల్లో క్రెడిట్ కార్డు వాడకం ఎక్కువైంది. అయితే క్రెడిట్ కార్డును వాడటం వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో..అంతకు మించి నష్టాలు కూడా ఉన్నాయి..జూలై 1, 2022 నుంచి క్రెడిట్ కార్డుకి సంబంధించిన కొన్ని నియమాలు మారబోతున్నాయి. బ్యాంకుల నిర్ణయాలు ఏకపక్షంగా ఉండకుండా, కస్టమర్లకు మేలు చేసేలా కేంద్ర రిజర్వు బ్యాంకు వీటిని రూపొందించింది. మరి ఈ నిబంధనలు ఏంటి? వీటి వల్ల వినియోగదారులకు ప్రయోజనం ఏంటో ఇప్పుడు చూద్దాం..
ఇకపై క్రెడిట్ కార్డులు జారీ చేసే బ్యాంకులు కొత్త కార్డులు మంజూరు చేయాలన్నా, లేదా ప్రస్తుతం ఉన్న కార్డులను అప్‌గ్రేడ్ చేయాలన్నా వినియోగదారుడి అనుమతి కచ్చితంగా తీసుకోవాలి. కస్టమర్ల అనుమతి లేకుండా కొత్తకార్డులు మంజూరు చేసినా లేదా అప్‌గ్రేడ్ చేసిన తర్వాత వాటికి ఛార్జీలు వసూలు చేసినా.. బ్యాంకులే ఆ బిల్లును తిరిగి వినియోగదారుడికి చెల్లించాల్సి ఉంటుంది. అంతేకాదు ఆ ఛార్జీలకు రెట్టింపు మొత్తం ఫైన్‌గా కస్టమర్‌కే చెల్లించాలి.
క్రెడిట్ కార్డు క్లోజ్ చేయాలని వినియోగదారులు బ్యాంకులను కోరితే.. ఏడు రోజుల్లోనే ఆ ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఏడు రోజులు పూర్తయినా క్రెడిట్ కార్డు క్లోజ్ చేయకపోతే.. 8వ రోజు నుంచి రోజుకు రూ.500 చొప్పున ఫైన్ చెల్లించాలి. ఎన్ని రోజులు ఆలస్యమైతే అన్ని రోజుల పాటు కస్టమర్‌కు ఫైన్ కట్టక తప్పదు.
క్రెడిట్ కార్డు క్లోజ్ చేశాక అందులో ఇంకా బ్యాలెన్స్ ఏమైనా మిగిలితే ఆ మొత్తాన్ని వినియోగదారుడి బ్యాంకు ఖాతాలోకి జమ చేయాలి. ఒక వేళ బ్యాంకు వివరాలు లేకపోతే.. కస్టమర్‌ను అడిగి తీసుకోవాలి.
ఇకపై క్రెడిట్ కార్డులు బిల్లింగ్ తేదీల సైకిల్ గత నెల 11 నుంచి ప్రస్తుత నెల 10 వరకు పరిగణనలోకి తీసుకోవాలి. వినియోగదారులు ఈ బిల్లింగ్ తేదీలను మార్చుకోవాలనుకుంటే అందుకు ఒకసారి అవకాశం ఇవ్వాలి.
ఆర్బీఐ కొత్త నిబంధనల ప్రకారం క్రెడిట్ కార్డు సంస్థలు వినియోగదారులకు తప్పుడు బిల్లులు పంపడానికి వీల్లేదు. ఒకవేళ వినియోగదారుడి నుంచి అభ్యంతరాలు వ్యక్తమైతే బిల్లుకు సంబంధించి కచ్చితమైన ఆధారాలు, పత్రాలను సంబంధిత సంస్థ 30 రోజుల్లోగా చూపించాల్సి ఉంటుంది.