వాట్సాప్ వాడుతున్నారా? ఈ తప్పులు అస్సలు చేయకండి!

0
136

మొబైల్‌ యూజర్లకు వాట్సాప్‌ ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను తీసుకొస్తుంది. ఆన్‌లైన్‌ భద్రతపై వినియోగదారులకు అవగాహన కల్పించేందుకు ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లను తీసుకొస్తున్నాయి సామాజిక మాధ్యమిక సంస్థలు. యూజర్‌ ఫ్రెండ్లీ మెసేజింగ్ యాప్‌ వాట్సాప్‌ కూడా కొత్తగా ‘సేఫ్టీ ఇన్‌ ఇండియా’ పేరుతో రిసోర్స్ హబ్‌ను అందుబాటులోకి తెచ్చింది. వాట్సాప్‌ ప్రతి నెలా నకిలీ ఖాతాలను తొలగించడంతోపాటు, వేర్వేరు కారణాలతో ఖాతాలపై నిషేధం విధిస్తుంటుంది. ఇలా వాట్సాప్‌ నిషేధించే ఖాతాల్లో కొన్ని కంపెనీ నిబంధనలు అతిక్రమించడంవల్ల, మరికొన్ని అవగాహన లోపంతో యూజర్స్‌ చేసే పొరపాట్ల వల్ల జరిగేవే ఉంటున్నాయి. మరి వాట్సాప్ ఎలాంటి తప్పులు చేస్తే ఖాతాలపై నిషేధం విధిస్తుందో తెలుసుకుందాం.

గుర్తింపు లేని నంబర్స్‌ లేదా తెలియని నంబర్స్​ను వాట్సాప్‌లో ఫార్వాడ్ చేయడం, గ్రూపులలో యాడ్ చేయమని కోరవద్దు. ఎందుకంటే నకిలీ సమాచారం వ్యాప్తి చేసే, గుర్తింపు లేని నంబర్లను ప్రమోట్ చేస్తున్నారనే కారణంతో మీ ఖాతాపై వాట్సాప్‌ నిషేధం విధించవచ్చు. అందుకే అపరిచితులు, గుర్తింపు లేని ఖాతాల నుంచి వచ్చే కస్టమర్‌ కేర్ నంబర్లు లేదా ముఖ్యమైన నంబర్లు అంటూ వచ్చే వాటిని ఫార్వాడ్‌ లేదా షేర్‌ చేయొద్దు.

నకిలీ సమాచార వ్యాప్తి కోసం ఎక్కువ మంది నకిలీ ఖాతాలను వినియోగిస్తుంటారు. ముఖ్యంగా ఆఫర్ల పేరుతో యూజర్లను మోసం చేసేందుకు బిజినెస్ ఖాతాల ద్వారా ఇలాంటి ఎక్కువగా జరుగుతుంటాయి. వాటిని గుర్తించి వాట్సాప్‌ ఎప్పటికప్పుడు తొలగించడం లేదా నిషేధిస్తుంది. కొన్నిసార్లు స్నేహితులను, దగ్గరి వారిని ఆట పట్టించాలనే ఉద్దేశంతో పేర్లు, ఇతరత్రా వివరాలు మార్చి ఖాతాలు క్రియేట్ చేస్తుంటాం. ఒకవేళ యూజర్స్‌ దానిపై ఫిర్యాదు చేస్తే నకిలీ ఖాతాతోపాటు, దానికి అనుబంధంగా ఉన్న ఫోన్‌ నంబర్‌తో ఎలాంటి ఖాతా తెరవకుండా వాట్సాప్ నిషేధం విధిస్తుంది.

వాట్సాప్‌లో ఉండే ఫీచర్లు కాకుండా, అదనపు ఫీచర్ల కోసం కొంత మంది యూజర్స్‌ మోడిఫైడ్‌ వెర్షన్‌ వాట్సాప్‌ యాప్​లను వినియోగిస్తుంటారు. ఈ జాబితాలో డెల్టా వాట్సాప్‌, జీబీ వాట్సాప్‌, వాట్సాప్‌ ప్లస్ వంటివి ఉన్నాయి. వీటి ద్వారా ఖాతాలు తెరవడం, మెసేజింగ్ చేయడం, గ్రూపులు క్రియేట్‌ చేయడంపై వాట్సాప్‌ నిషేధం విధించింది. ఎందుకంటే వీటికి వాట్సాప్‌లో ఉండే ఎండ్‌-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్‌ భద్రత ఉండదు. అలానే వీటి ద్వారా యూజర్‌ డేటా సులువుగా హ్యాకర్స్‌కు చేరిపోతుంది.