సినీ తారలు వ్యాపార రంగంలోకి అడుగు పెట్టడం కొత్తేం కాదు. ఇప్పటికే చాలా మంది తారలు ఓవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు వ్యాపార రంగంలోనూ రాణిస్తున్నారు. ఫిట్‌నెస్, రెస్టారెంట్, క్లాత్ బ్రాండ్.. ఇలా రకరకాల వ్యాపార రంగాల్లోకి దిగుతున్నారు. ఇప్పుడీ జాబితాలోకి మరో హీరో వచ్చి చేరారు. అతనే.. లోక నాయకుడు కమల్ హాసన్. మొన్నటి వరకు రాజకీయాల్లో బిజీగా ఉన్న కమల్ ఇప్పుడు వస్త్ర వ్యాపారంలోకి ఎంట్రీ ఇవ్వనున్నారు.
ఈ క్రమంలోనే ‘హౌజ్ ఆఫ్ ఖద్దర్’ పేరుతో ఫ్యాషన్ బ్రాండ్‌ను లాంచ్ చేయడానికి కమల్ సిద్ధమవుతున్నారు. నవంబర్ 7న కమల్ హాసన్ పుట్టిన రోజు.. ఈ సందర్భంగా ఈ బ్రాండ్‌ను ఆవిష్కరించనున్నారని తెలుస్తోంది. అమెరికాలోని చికాగో నగరంలో తన బ్రాండ్‌ను లాంచ్ చేయడానికి కమల్ ఆసక్తి చూపిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.
ఈ ఖాదీ దుస్తుల గురించి కమల్ మాట్లాడుతూ.. ‘మన దేశానికి ఖాదీ ఓ గర్వకారణం. అన్ని వాతావరణ పరిస్థితులకు అనుకూలంగా ఉంటుంది. చలికాలంలో ఉండే అసౌకర్యాన్ని, వేసవి కాలంలో ఉండే వేడి నుంచి మనకు ఉపశమనం ఇస్తుంది. యువతకు ఖాదీని మరింత చేరువ చేయాలని, చేనేత కళాకారుల స్థితిగతులను మెరుగుపరచాలన్నది నా ఆలోచన’ అని చెప్పుకొచ్చారు.