ఫేస్‌బుక్‌కు జుకర్‌బర్గ్‌ గుడ్‌ బై?

Zuckerberg goodbye to Facebook?

0
74

ఫేస్‌బుక్‌ వ్యవస్థాపకుడు, ప్రస్తుత సీఈవో మార్క్‌ జుకర్‌బర్గ్‌ (37) రాజీనామాకు సిద్ధమయ్యాడా? బోర్డులో మెజార్టీ సభ్యులు వద్దని వారిస్తు‍న్నా..మొండిగా నిర్ణయం తీసుకోనున్నాడా? సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌ మీద ఈమధ్య కాలంలో వినిపిస్తున్న సంచలన ఆరోపణలు, జుకర్‌బర్గ్‌ నేతృత్వంపై వినిపిస్తున్న తీవ్ర విమర్శల నేపథ్యంలో ఇది నిజం కాబోతోందని బ్రిటన్‌కు చెందిన ఓ ప్రముఖ టాబ్లాయిడ్‌ సంచలన కథనం ప్రచురించింది.

యూజర్ల డాటా లీకేజీ గురించి ఫేస్‌బుక్‌ ఎప్పటి నుంచో విమర్శలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే.  ఇదీగాక ఇన్‌స్టాగ్రామ్‌తో మానసిక ఆరోగ్యం దెబ్బతింటోందంటూ ఫేస్ బుక్ మాజీ ఉద్యోగిని హౌగెన్ సంచలన ఆరోపణలు చేస్తూ వస్తోంది. యూజర్‌ భద్రత కంటే లాభాలే ఫేస్‌బుక్‌కు పరమావధిగా మారిందని ఆమె తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ తరుణంలో ఫేస్‌బుక్‌ కంపెనీలో సంస్కరణల దిశగా అడుగువేయాలని కోరుతూనే.. కంపెనీ సీఈవో మార్క్‌ జుకర్‌బర్గ్‌ను  ఆ పదవి నుంచి తొలగించాలని పెద్ద ఎత్తున్న ఉద్యమం నడుస్తోంది.

అంతేకాదు నవంబర్‌ 10న “క్విట్ ఫేస్ బుక్” పేరుతో ఒక్కరోజు ఫేస్‌బుక్‌, దాని అనుబంధ యాప్‌లను వాడొద్దంటూ పెద్ద ఎత్తున్న క్యాంపెయిన్‌ నడిపిస్తున్నారు. ఈ క్రమంలో యూజర్ల అసంతృప్తి బయటపడింది. ఈ వరుస పరిణామాలన్నింటితో ఫేస్‌బుక్‌ కంపెనీ బోర్డులో కొందరు సభ్యులు జుకర్‌బర్గ్‌ నాయకత్వంపై అసంతృప్తితో ఉన్నట్లు సదరు కథనం ప్రచురించింది.

ఈ క్రమంలోనే ఓటింగ్‌ కంటే ముందే స్వచ్చందంగా సీఈవో బాధ్యతల నుంచి తప్పుకోవాలని జుకర్‌బర్గ్‌ భావిస్తున్నట్లు, ఇందుకు కుటుంబ సభ్యులు, స్నేహితులు సైతం జుకర్‌బర్గ్‌ ప్రొత్సహించినట్లు ఆ కథనం సారాంశం. అయితే మెజార్టీ బోర్డు సభ్యులు మాత్రం జుకర్‌బర్గ్‌ నాయకత్వం వైపే మొగ్గు చూపిస్తుండడం విశేషం.