ఒకే నంబర్‌ నుంచి 20 కోట్ల స్పామ్‌ కాల్స్‌..సంచలన నిజాలు వెల్లడించిన ట్రూకాలర్

0
90

కాలర్‌ ఐడెంటిఫికేషన్ యాప్ ట్రూకాలర్ భారత్‌లో స్పామ్‌కాల్స్‌కు సంబంధించి ఆసక్తికరమైన విషయాన్ని తెలిపింది. ఈ ఏడాదిలో ఒకే ఫోన్ నంబర్‌ నుంచి 202 మిలియన్‌ (సుమారు 20.2 కోట్లకుపైగా) స్పామ్‌కాల్స్‌ (Spam Calls) చేసినట్లు వెల్లడించింది.

అంటే ఒక ఫోన్ నంబర్ నుంచి రోజుకు 6 లక్షల 64 వేల మందికి, గంటకి 27 వేల మందికి స్పామ్‌కాల్స్ చేశారని తెలిపింది. 2021 గ్లోబల్‌ స్పామ్‌ రిపోర్ట్‌లో ట్రూకాలర్‌ ఈ విషయాన్ని వెల్లడించింది. 2021 జనవరి నుంచి అక్టోబర్‌ కాలానికి ఈ నివేదికను రూపొందించినట్లు తెలిపింది.

ట్రూకాలర్‌ వేర్వేరు ప్రాంతాల్లో స్పామ్‌కాలర్స్‌ను గుర్తించి వారి జాబితాను రూపొందిస్తుంది. తర్వాత ట్రూకాలర్‌లోని టెక్నాలజీ సాయంతో వారిని ఆటోమేటిగ్గా బ్లాక్ చేస్తుంది. అయితే ఈ జాబితాలో ఇతర ప్రాంతాల వారికంటే ఎక్కువగా భారత్‌లో ఒకే నంబర్‌ నుంచి 20 కోట్ల స్పామ్‌కాల్స్ చేసినట్లు గుర్తించామని తెలిపింది. స్పామ్‌కాల్స్‌ బారిన పడుతున్న టాప్‌ 20 దేశాల్లో భారత్‌ నాలుగో స్థానంలో ఉన్నట్లు తన నివేదికలో పేర్కొంది. గతేడాది ఈ జాబితాలో భారత్‌ 9వ స్థానంలో ఉండటం గమనార్హం.

ఈ సూచీలో ఒక యూజర్‌కు నెలకు 33 స్పామ్‌కాల్స్‌తో బ్రెజిల్ మొదటి స్థానంలో, 18 కాల్స్‌తో పెరూ రెండో స్థానంలో ఉన్నాయి. ఈ గణాంకాల ప్రకారం భారత్‌లో ఒక్కో యూజర్‌కు నెలకు 16.8 స్పామ్‌కాల్స్ వస్తున్నాయట. భారతీయ యూజర్స్‌కు వచ్చే స్పామ్‌కాల్స్‌లో 93 శాతం సేల్స్‌, టెలీ మార్కెటింగ్, ఆర్థిక సేవలకు సంబంధించినవి ఉంటున్నాయని ట్రూకాలర్‌ తెలిపింది.