హైదరాబాద్ నగరంలో 5 దశాబ్దాల క్రితం జరిగిన భూకబ్జా వ్యవహారం ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది. 53 ఏళ్ల క్రితం ఫోర్జరీ సంతకాలతో నాలుగున్నర ఎకరాల భూమి కబ్జా చేసిన వ్యవహారం ఇప్పుడు సంచలనం రేపుతున్నది. అప్పట్లో ఆ భూమి విలువ కేవలం 3లక్షలు మాత్రమే. ఇప్పుడు అదే భూమి విలువ 100 కోట్లు పలుకుతున్నది. ఈ ఇష్యూ రియల్ ఎస్టేట్ వర్గాల్లో కలకలం రేపుతున్నది. హైదరాబాద్ సెంట్రల్ క్రైం స్టేషన్ (సిసిఎస్) పోలీసులకు ఒక ఎన్నారై చేసిన ఫిర్యాదుతో ఈ ముచ్చట బయటి ప్రపంచానికి తెలిసింది. పూర్తి వివరాల కోసం కింద ఉన్న Real Estate Tv వీడియో చూడండి… వివరాలు చదవండి.
అమెరికాలోని వర్జీనియాలో ఉంటున్న 87 ఏళ్ల వయసున్న డాక్టర్ టి.విశ్వాస్ రావుకు చెందిన 4.25 ఎకరాల భూమిని 53 ఏళ్ల క్రితం పక్కాగా కబ్జా చేశారు. అప్పట్లో ఆ భూమి విలువ 3 లక్షల రూపాయలు మాత్రమే. ఇప్పుడు ఆ భూమి విలువ అక్షరాలా వంద కోట్లు. విశ్వాస్ రావు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా తప్పుడు పత్రాలతో ఆ భూమిని కబ్జా చేసుకున్న సత్యనారాయణ అనే వ్యక్తి కోసం పోలీసులు గాలిస్తున్నారు. రెవెన్యూ, రిజిస్ట్రేషన్ రికార్డులను పరిశీలిస్తున్నారు.
అబిడ్స్ లోని చిరాగ్ అలీ లేన్ లో ఉంటున్న విశ్వాస్ రావు తండ్రి రెవరెండ్ సిఎ జుడే 1965లో నార్సింగి గ్రామంలో సర్వే నెంబరు 340/25 లో 4.25 ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. ఈ విషయాన్ని అప్పట్లో ఆయన తన పిల్లలెవరికీ చెప్పలేదు. సేల్ డీడ్ మాత్రం తీసుకొచ్చి ఇంట్లో దాచిపెట్టారు. 1968లో జుడే చనిపోయారు. విశ్వాస్ రావు తమ్ముడు, అక్కా చెల్లెళ్లకు ప్రభుత్వ ఉద్యోగాలొచ్చాయి. విశ్వాస్ రావు ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిపోయారు. అక్కడే స్థిరపడ్డారు. తమ్ముడు, అక్కా చెల్లెలు వయోభారంతో చనిపోయారు. విశ్వాస్ రావు హైదరాబాద్ కు అప్పుడప్పుడు మాత్రమే వచ్చి వెళ్తుండేవారు. అబిడ్స్ లో ఇల్లు మాత్రం తన స్వాధీనంలో ఉంచుకున్నారు. లాక్ డౌన్ కు ముందు హైదరాబాద్ కు వచ్చిన ఆయన ఇంట్లో అన్ని పత్రాలు, కాగితాలను చూస్తున్న క్రమంలో నార్సింగి గ్రామంలో భూమిని కొనుగోలు చేసిన సేల్ డీడ్ పత్రాలు కంటపడ్డాయి.
అయితే భూమి పత్రాలను పరిశీలించిన అనంతరం తన తమ్ముడి పిల్లలకు ఈ విషయాన్ని చెప్పి.. ఆ భూమి స్టేటస్ ఏంటి? పూర్తి వివరాలు సేకరించండి అని సూచించారు. 1968లో సత్యనారాయణ అనే వ్యక్తి విశ్వాస్ రావు తల్లి, తమ్ముడు, అక్కా చెల్లెలు జిపిఎ చేయించినట్లు రికార్డులున్నాయని వారు చెప్పారు. తమకు ఆస్తులున్నట్లు పెద్దలు చెప్పలేదని వారు వివరించారు. దీంతో జిపిఎ పత్రాల జిరాక్స్ కాపీలను తెప్పించుకుని పరిశీలించగా తన తల్లి, సోదరుడు, అక్కా చెల్లెళ్ల ఫింగర్ ప్రింట్స్ కావని తేలింది. ఫోర్జరీ సంతకాలు, వేలిముద్రలతో భూమిని కబ్జా చేశారని తేలిపోయింది. దీంతో ఆయన అన్ని వివరాలతో ఒక రిపోర్ట్ రెడీ చేసి అసలు సేల్ డీడ్ పత్రాలతో సిసిఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. 53ఏళ్ల కిందట జరిగిన వ్యవహారం కావడంతో పోలీసులు పక్కాగా సాక్ష్యాధారాలను సేకరించే పనిలో పడ్డారు. ఈ కేసులో ఏరకమైన పరిష్కారం లభిస్తుందో చూడాలి. ఏది జరిగినా పెద్ద సంచలనమే అవుతుందని రియల్ ఎస్టేట్ వర్గాలు భావిస్తున్నాయి.