తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. వీకెండ్ కావడం, కొవిడ్ పరిస్థితులు తగ్గుతుండటంతో పెద్ద సంఖ్యలో భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ క్రమంలో ఇవాళ భారీ సంఖ్యలో భక్తులు తరలిరావడంతో అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద వాహనాలు బారులు దీరాయి. దీనితో భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
తనిఖీలకు సమయం పడుతుండటంతో గంటల తరబడి భక్తులు వాహనాల్లోనే వేచి ఉండాల్సి వస్తోంది. ఫలితంగా రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. తిరుమలకు చేరుకున్న యాత్రికులకు అద్దె గదుల కొరత ఏర్పడింది. రద్దీకి సరిపడా గదులు లేకపోవడంతో కేంద్రాల వద్ద పడిగాపులు కాస్తున్నారు భక్తులు.
మరోవైపు తిరుమల రెండో ఘాట్ రోడ్డులో ఓ కారు అగ్నికి ఆహుతైంది. కర్నూలుకు చెందిన భక్తులు కారులో తిరుమల కొండపైకి వెళుతుండగా ఈ ఘటన జరిగింది. రెండో ఘాట్ రోడ్డు ఆఖరి మలుపు వద్ద కారులో మంటలు చెలరేగాయి. ఇంజిన్ ముందు భాగంలో మొదలైన మంటలు కొద్దిసేపట్లోనే కారంతా వ్యాపించాయి. అయితే, భక్తులు వెంటనే కారు దిగిపోవడంతో పెనుప్రమాదం తప్పింది. కాగా, ఘటనపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, టీటీడీ అధికారులు వెంటనే స్పందించి మంటలను ఆర్పివేశారు.
కారు ఆహుతి అవుతున్న వీడియో చూడడానికి కింది లింక్ ను క్లిక్ చేయండి
https://www.youtube.com/watch?v=woeXrhCzvCw