ఎక్కడైనా ఎవరిని అయినా పాము కాటేయగానే వెంటనే ఆస్పత్రికి వెళతారు. వైద్యులకి విషయం చెప్పి పాము కాటుకి మందు తీసుకుంటారు. ఇక పసరు లాంటివి వద్దు అనే చెబుతారు వైద్యులు. కచ్చితంగా పాము కాటుకి విరుగుడు మందు తీసుకోవాలి. కర్ణాటకలోని బళ్లారి జిల్లాలో ఆసక్తికర సంఘటన జరిగింది. ఓ యువకుడ్ని నాగుపాము కాటేసింది. అయితే అతను ఆ పాముని చేతిలో పట్టుకుని ఆసుపత్రికి వెళ్లాడు.
ఉప్పరహళ్లి గ్రామానికి చెందిన కాడప్ప పొలంలో పనిచేస్తుండగా పాము కాటుకు గురయ్యాడు. అయితే ఆ కరిచిన పాము ఏమిటో తెలియలేదు. దీంతో వెంటనే భయపడకుండా ఆ పాముని చేతితో పట్టుకుని ఆస్పత్రికి వెళ్లాడు. ముందు వైద్యులు కూడా షాక్ అయ్యారు.
పాముతో సహా కాడప్ప బళ్లారి ఆసుపత్రికి వెళ్లాడు. తనను కరచింది ఈ పామేనని అక్కడి వైద్యులకు తెలిపాడు. దాంతో వైద్యులు వెంటనే అతడికి తాచుపాము విషానికి సంబంధించిన యాంటీ-స్నేక్ వీనమ్ ఇంజెక్షన్ ఇచ్చారు. అయితే తనని కరిచింది ఏపామో వైద్యులకి తెలిసేలా ఇలా పాము తీసుకువచ్చాను అని చెప్పాడు ఈ వ్యక్తి.