క్షణికావేశంలో ఎంతటి మనిషైనా వివేకం కోల్పోతారు. అటువంటి ఘటనే హైదరాబాద్ లో జరిగింది. ఇప్పుడే పెళ్లి వద్దు.. తర్వాత చేసుకుందాం అన్నందుకు ఆమె ప్రియుడు ఆవేశానికి లోనై ఏకంగా భవనం నాలుగో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. హైదరాబాద్, బాలానగర్ సిఐ వహీదుద్దీన్ వెల్లడించిన వివరాలు..
మూసాపేట రెయిన్ బో విస్టా లో నివాసముంటున్న కె.శుభమ్ (27) అమెజాన్ లో ఉద్యోగం చేస్తున్నాడు. మూడేళ్లుగా బాలానగర్ శోభన కాలనీ లోని రోడ్డు నెంబర్ 1 లో ఉంటున్న సోనియా గోగికర్ ను ప్రేమిస్తున్నాడు. ఇద్దరూ ఒకరినొకరు ఇష్టపడుతున్న విషయం కుటుంబసభ్యులకు తెలిసింది. వారు కూడా వీరిరువురి ప్రేమ పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
ఈ క్రమంలో శుభమ్ పెళ్లికి తొందరపెట్టే ప్రయత్నం చేశాడు. కానీ తన అక్కకు పెళ్లి కావాల్సి ఉందని, ఆమె పెళ్లి కాకుండా తాను పెళ్లి చేసుకోవడం బాగుండదని సోనియా గోగికర్ వాయిదా వేస్తూ వస్తోంది. ఆదివారం రాత్రి 11 గంటల సమయంలో శుభమ్ మరోసారి సోనియా ఇంటికెళ్లి పెళ్లి గురించి ప్రస్తావించాడు.
అక్క పెళ్లి కాకుండా తాను పెళ్లి చేసుకునే ప్రసక్తే లేదని అప్పటి వరకు ఆగాల్సిందేనని తేల్చి చెప్పింది సోనియా. దీంతో ఆవేశానికి లోనైన శుభమ్ భవనంలోని నాలుగో అంతస్తుకు చేరుకుని అక్కడి నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. శుభమ్ తండ్రి కిషన్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.