మురుగైన ఛానెల్ లో యాంకర్ పై వేధింపులు : కొత్త ట్విస్ట్

Anchor Harassment case in telugu news channel / new twist

0
101

తెలుగులో మురుగైన టివి ఛానెల్ గా గుర్తింపు పొందిన ఒక వార్తా ఛానెల్ లో మహిళా యాంకర్ పై వేధింపుల పర్వం చిలికి చిలికి గాలివానలా మారింది. ఈ యవ్వారం ఇప్పుడు సిసిఎస్ పోలీసుల దాకా చేరింది. తీగ లాగితే డొంక కదిలిన చందంగా ఇందులో సరికొత్త ట్విస్ట్ లు చోటు చేసుకుంటున్నాయి. తొలుత మీ ఇంటర్నల్ మ్యాటర్ మీరే పరిష్కరించుకోండి అని సూచన చేసిన పోలీసులు మురుగైన టివి ఆఫీసులో ఎటూ తేలకపోవడంతో తుదకు రంగంలోకి దిగారు. కేసు ఫైల్ చేశారు. ఇప్పటికే ఈ కేసులో ఎ1, ఎ2, ఎ3, ఎ4 గా నలుగురు నిందితుల మీద ఎఫ్ఐఆర్ ఇష్యూ అయిందని ప్రచారంలో ఉంది. ఇప్పటికే ప్రధాన నిందితులైన ఇద్దరు మహిళా యాంకర్ల ఉద్యోగాలు ఊడిపోయాయి. పక్క ఛానెల్ లో పనిచేసే మరో మగ యాంకర్ ను కూడా నిందితుడి జాబితాలోకి ఎక్కించినట్లు సమాచారం అందుతోంది. ఈ వేధింపుల పర్వంలో మరికొందరిని కూడా పోలీసులు అనుమానిస్తున్నారు. వేధింపుల జాబితాలో ఒక క్రైం రిపోర్టర్ పేరు కూడా పోలీసుల అనుమానితుల జాబితాలో ఉన్నట్లు తేలింది.

మీడియా వర్గాల్లో సంచలనం రేపిన ఈఘటనకు సంబంధించి విశ్వసనీయ సమాచారం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి.
తెలుగు మీడియాలో అనగనగా ఒక మురుగైన ఛానెల్. అందులో ఒక మహిళా యాంకర్ సెల్ ఫోన్ ను మరో ఇద్దరు మహిళా యాంకర్లు బలవంతంగా తీసుకున్నారు. ఆమెకు తెలియకుండానే ఆ సెల్ ఫోన్ లోని పర్సనల్ డేటా తస్కరించారు. అందులో ఆ అమ్మాయికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు ఉన్నాయి. వాటిని సదరు ఇద్దరు యాంకర్లు సంస్థలో పనిచేసే మిగతా ఉద్యోగులకు షేర్ చేశారు. అలా ఆ ఫొటోలు, వీడియోలు చక్కర్లు కొడుతూ తుదకు సదరు యాంకర్ వద్దకు చేరాయి. దీంతో షాక్ కు గురైన ఆ యువతి సంబంధిత ఛానెల్ పెద్దలకు ఫిర్యాదు చేసింది. కానీ ఆ విషయాన్ని ఛానెల్ పెద్దలు లైట్ తీసుకోవడమే కాకుండా ఎతేష్కం చేశారు. తప్పనిసరి పరిస్థితుల్లో సదరు యువతి ఆందోళనకు గురై భయంతో సిసిఎస్ పోలీసులను ఆశ్రయించారు.

తొలుత సిసిఎస్ పోలీసులు మీలో మీరే పరిష్కరించుకోండి అన్నారు. కానీ విషయం కొలిక్కి రాలేదు. దీంతో సమస్య తీవ్రతను గుర్తించిన పోలీసులు కేసు విచారణ షురూ చేశారు. అయితే ఇంతలో ఫోన్ గుంజుకుని డేటా షేర్ చేసిన ఇద్దరు మహిళా యాంకర్లను ఉద్యోగంలోంచి పీకేసింది యాజమాన్యం. ప్రస్తుతం వారిద్దరూ కేసులో ఎ1, ఎ2 గా ఉన్నారు. మురుగైన టివి ఛానెల్ కు సంబంధం లేని ఒక వ్యక్తి ఇందులో ఎ3గా ఉండగా, ఈ కేసులో ఇంకో ఛానెల్ లో పనిచేసే మగ యాంకర్ కూడా నిందితుడి జాబితాలో ఎ4 గా చేర్చారు. ఈ కేసులో ఒక క్రైం రిపోర్టర్ పేరు కూడా ప్రచారంలో ఉంది. ఇప్పటికే పోలీసులు గతంలో జరిగిన వేధింపుల పర్వానికి సంబంధించి ఆధారాలను సైతం ఆ అమ్మాయి నుంచి సేకరించినట్లు తెలుస్తోంది.

నిత్యం సమాజానికి మురుగు పంపిణీ చేస్తున్న ఈ ఛానెల్ లో జరుగుతున్న అరాచకాలు మీడియా వర్గాలను సైతం ముక్కు మీద వేలేసుకునేలా చేస్తున్నాయి. ఈ డేటా చోరీ కేసు ఎటు దారితీస్తుందోనని ఛానెల్ ఉద్యోగులతోపాటు మీడియా వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది.