తాలిబన్ల మరో అరాచకం

0
97

ఆఫ్ఘనిస్థాన్‌లో తాలిబన్ల అరాచకాలకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది. డ్రగ్స్ బానిసలపై వారు వ్యవహరిస్తున్న తీరు ప్రపంచాన్నే నివ్వెర పరుస్తోంది. మాదక ద్రవ్యాలకు బానిసైన వారిని సాధారణంగా బాధితులుగా పరిగణించి వైద్య సహాయం అందించడంతో పాటు, కౌన్సెలింగ్ వంటి వాటితో వారిని తిరిగి మామూలు మనుషులుగా మార్చే ప్రయత్నం చేస్తారు.

అయితే, తాలిబన్లు మాత్రం డ్రగ్స్ బానిసలపై క్రూరంగా వ్యవహరిస్తున్నారు. వారిని జైళ్లలాంటి శిబిరాలకు తరలించి విచక్షణ రహితంగా వ్యవహరిస్తున్నారు. గుండు కొట్టించడంతో పాటు సరైన తిండిపెట్టకుండా ఆకలితో అలమటించేలా చేస్తున్నారు. ఫలితంగా వారంతా చిక్కి శల్యమై జీవచ్ఛవాల్లా కనిపిస్తున్నారు.

డ్రగ్స్ వాడడం ఇస్లాం ప్రకారం తీవ్ర నేరమని చెబుతున్న తాలిబన్లు..వారు సమాజ వినాశకారులంటూ తీవ్ర శిక్షలు విధిస్తున్నారు. క్రూరంగా వ్యవహరిస్తే తప్ప డ్రగ్స్ అలవాటును మాన్పించలేమని చెబుతూ సరైన తిండిపెట్టకుండా హింసిస్తున్నారు. ఇలా చేస్తే కొందరు మరణించినా మిగతా వారైనా మారుతారని తాలిబన్లు చెప్పడం కొస మెరుపు.