‘‘మా ఇంట్లో దోపిడీ జరిగింది.. అగంతకులు ఇంట్లో ఉన్న మహిమ గల జ్యోతిష్య రంగు రాళ్లు కొట్టేశారు.. వాటి విలువ సుమారు 30 నుంచి 40 లక్షలు ఉంటుంది.. ఎలాగైనా ఆ దొంగ రాస్కెల్స్ ను పట్టుకుని నా జ్యోతిష్య రంగు రాళ్లు నాకు ఇప్పించండి’’ అని హైదరాబాద్ లో ఒక జ్యోతిష్యుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఫాఫం జ్యోతిష్యుడు కష్టాల్లో ఉన్నాడనుకుని పోలీసులు వేట షురూ చేశారు. అసలు గుట్టు తెలిసి ముక్కు మీద వేలేసుకున్నారు. జ్యోతిష్యుడి లీలలను మీడియా సమావేశంలో బుధవారం నాడు హైదరాబాద్ ఎల్బీ నగర్ లోని సిపి క్యాంపు కార్యాలయంలో రాచకొండ క్రైమ్స్ డిసిపి యాదగిరి, ఎల్బీ నగర్ ఎసిపి శ్రీధర్ రెడ్డి వెల్లడించారు.
బండ్లగూడ లోని న్యూ వెంకటరమణ కాలనీలో ఉండే బాల మురళీ కృష్ణ అనే జ్యోతిష్యుడు వారం రోజుల క్రితం తన ఇంట్లో రంగు రాళ్లు చోరీకి గురయ్యాయని ఎల్బీ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు మొదలు పెట్టారు. పోలీసులు తవ్విన కొద్దీ జ్యోతిష్యుడి లీలలు ఒక్కొక్కటిగా బయటకొచ్చాయి. సదరు జ్యోతిష్యుడు చిన్న పిల్లలు ఆడుకునే 2వేల రూపాయల నకిలీ నోట్లను అసలు నోట్లుగా నమ్మించి మోసాలకు పాల్పడుతున్నట్లు విచారణలో తేలింది. అంతేకాదు జ్యోతిష్యుడి ఇంట్లో దోపిడీకి పాల్పడిన ఆరుగురితోపాటు జ్యోతిష్యుడిని కూడా పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ చేశారు. జ్యోతిష్యుడి వద్ద 17.72 కోట్ల విలువైన 2వేల నకిలీ నోట్లు, 6.32 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు.
ఈ శర్మ ఫ్లాష్ బ్యాక్ ఇదీ…
గుంటూరు జిల్లా పిడుగురాళ్లకు చెందిన బెల్లంకొండ మురళీకృష్ణ శర్మ (35) విజయవాడ సూర్యారావుపేటలో నివాసముంటున్నాడు. పొట్టకూటి కోసం రంగురాళ్లు అమ్ముతూ ఉండేవాడు. 2017 సంవత్సరంలో భక్తి నిధి ఒక వెబ్ సైట్ స్టార్ట్ చేశాడు. రంగు రాళ్లను ఆన్ లైన్ లో అమ్మడం స్టార్ట్ చేశాడు. పలు టివీల్లో జ్యోతిష్యం, రంగురాళ్ల మహిమల గురించి షోలు ఇచ్చేవాడు. 2020 జనవరిలో ఒక కేసులో విశాఖపట్నం సిబిఐ అధికారులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. 2021 ఫిబ్రవరిలో బెయిల్ మీద బయటకొచ్చిన బెల్లంకొండ మురళీకృష్ణ శర్మ ఆంధ్రాలో పరువు పోయిందని భావించి హైదరాబాద్ కు షిఫ్ట్ అయ్యాడు. నాగోల్ సమీపంలో బండ్లగూడ వద్ద నివాసం ఉంటున్నాడు. జ్యోతిష్యం కోసం తన వద్దకు వచ్చేవారికి తన వద్ద సూట్ కేసుల్లో ఉన 45 లక్షల నకలిలీ నోట్లు చూపించి అసలువేనని నమ్మించేవాడు. తనకు ఇంకా డబ్బు అవసరం ఉందని కొంది వద్ద చేబదులు కూడా తీసుకున్నాడు.
సీన్ కట్ చేస్తే శర్మ వద్ద ఉన్న డబ్బును, రంగురాళ్లను కొట్టేయాలని అతడి బంధువు నాగేంద్ర ప్రసాద్ శర్మ, వేల్పూరి పవన కుమార్ శర్మ, అలియాస్ చారి ఇద్దరు కలిసి స్కెచ్ వేశారు. పిడుగు రాళ్ల నుంచి దొండపాటి రామకృష్ణ (24), నల్లబోతుల సురేష్ గోపి(25), చండూరి విజయ్ కుమార్ (27), కంభంపాటి సూర్యం(25) లను హైదరాబాద్ రప్పించారు. ఈనెల 15న రాత్రి రామకృష్ణ, సురేష్ గోపి ఇద్దరూ జ్యోతిష్యుడు శర్మ ఇంట్లోంచి రెండు సూట్ కేసులను కొట్టేసి కారులో అక్కడి నుంచి పరారయ్యారు. విజయవాడ హైవేలో ఆ బ్రీఫ్ కేసులను తెరిచి చూడగా 16 నోట్లు తప్ప మిగిలిన 2వేల రూపాయల నోట్లన్నీ నకిలీవిగా గుర్తించారు. పోలీసులకు భయపడి వాటిని అక్కడే కాల్చేశారు.
తన ఇంట్లో చోరీ జరిగిందని సదరు జ్యోతిష్య శర్మ పోలీసులను 18వ తేదీన ఆశ్రయించడంతో రంగంలోకి దిగిన పోలీసులు నిందితులు వాడిన కారు నెంబర్ ఆధారంగా విచారణ జరిపి కేసును చేధించారు. మురళీ కృష్ణ శర్మ అసలు బాగోతం బయటకు వచ్చింది. వారితోపాటు కేసు పెట్టిన మురళీకృష్ణ శర్మను కూడా కటకటాల వెనక్కు నెట్టారు పోలీసులు.
పాత వార్త చదవండి…
జ్యోతిష్యుడి ఇంట్లో చోరీ : 40 లక్షల విలువైన జాతక రాళ్లు మాయం