బైక్ టాక్సీ అగ్రిగేటర్, లాజిస్టిక్ సర్వీసుల సంస్థ ర్యాపిడోకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఇటీవల సిటీల్లో బాగా విస్తరిస్తూ, లాభాల బాటలో ఉన్న ర్యాపిడో.. అదనపు ప్రచారం కోసం ఏకంగా అల్లు అర్జున్ తో చేసిన యాడ్ వివాదాస్పదమైంది. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణాన్ని కించపర్చేలా రూపొందిన సదరు ప్రకటనను హైకోర్టు నిషేధించింది.
దీనిపై విచారణ జరిపిన కోర్టు… సదరు యాడ్ లను నిలిపివేయాలంటూ ర్యాపిడోను ఆదేశించింది. అంతేకాదు, యూట్యూబ్ లోనూ ర్యాపిడో యాడ్ లు ప్రసారం చేయరాదని స్పష్టం చేసింది. తమ ఆదేశాలను అతిక్రమిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించింది.
ర్యాపిడో తెలుగు యాడ్ లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన సంగతి తెలిసిందే. ఆర్టీసీ కంటే ర్యాపిడో మేలు అనే రీతిలో ఆ యాడ్ రూపొందించినట్టు ఆరోపణలు వచ్చాయి. దీనిపై ఆర్టీసీ ఇప్పటికే ర్యాపిడో సంస్థకు, అల్లు అర్జున్ కు నోటీసులు పంపింది.
నిజానికి ర్యాపిడో యాడ్ లో చూపించిన బస్సు ఏపీఎస్ఆర్టీసీకి చెందినదే అయినా, ఆర్టీసీలంటే ప్రభుత్వరంగ సంస్థలే కాబట్టి టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ సదరు యాడ్ లో ఆర్టీసీ బస్సుల్ని కించపరిచారంటూ నోటీసులు పంపారు. దీనిపై సోషల్ మీడియాలోనూ పెద్ద ఎత్తున దుమారం చెలరేగింది. దాంతో ర్యాపిడో సంస్థ తన ప్రకటనను ఎడిట్ చేసింది. ఆర్టీసీ బస్సు స్పష్టంగా కనపడకుండా ఎడిట్ చేసిన వెర్షన్ లో అల్లు అర్జున్ డైలాగులు మాత్రం మారలేదు. చివరికీ వ్యవహారం కోర్టు వద్దకు చేరింది.