తెలంగాణాలో భారీ వర్షాలు ఎంతోమందిని బలిగొన్నాయి. తాజాగా ప్రజా సమస్యలపై ఎప్పటికప్పుడు లైవ్ ఇచ్చే రిపోర్టర్ ను వరదలు వదలలేదు. జగిత్యాల జిల్లా రాయికల్ మండలంలో ఎన్టీవీ రిపోర్టర్ జమీర్ వరద ప్రభావిత ప్రాంతాలకు రిపోర్టింగ్ కోసం వెళ్లి వస్తూ వరదనీటిలో కొట్టుకుపోయారు. బోర్ణపల్లికి చెందిన తొమ్మిది మంది కూలీలు జలదిగ్బంధంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే.
ఈ న్యూస్ కవర్ చేసేందుకు జగిత్యాలకు చెందిన ఎన్టీవీ జర్నలిస్టు మిత్రుడితో కారులో ప్రయాణిస్తుండగా వారి కారు రామోజీ పేట-భూపతిపూర్ మధ్య కల్వర్టు దాటుతూ ఉండగా నీటి ప్రవాహంలో కొట్టుకుపోయింది. అతని కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. కాగా శుక్రవారం ఉదయం జమీర్ మృతదేహం లభ్యమైంది. చెట్ల కొమ్మల్లో మృతదేహాన్ని రెస్క్యూ టీం గుర్తించింది. వెంటనే మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.