తెలంగాణలో మరో పరువు హత్య(Honour Killing) కలకలం రేపింది. కులాంతర వ్యక్తిని ప్రేమించి పెళ్ళి చేసుకుందని అక్కసుతో అక్కను తమ్ముడు అతి కిరాతకంగా నరికి చంపాడు. ఈ ఘటన రంగారెడ్డి(Rangareddy) జిల్లా ఇబ్రహీంపట్నం మండలం రాయపోల్ గ్రామంలో చోటు చేసుకుంది. బాధితురాలు హయత్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్న నాగమణిగా పోలీసులు వెల్లడించారు.
ఈ రోజు ఉదయం నాగమణి స్వగ్రామం Rangareddy జిల్లా రాయపోలు నుంచి హయత్‌నగర్ వెళ్తుండగా దారి మధ్యలో ఆమె కోసమే దారికాచిన తమ్ముడు పరమేష్.. ముందుగా కారుతో ఢీకొట్టి ఆపై కొడవలితో మెడపై పలుమార్లు నరికాడు. దీంతో నాగమణి అక్కడికక్కడే తుదిశ్వాస విడిచింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
అయితే నాగమణి 2020 బ్యాచ్‌కు చెందిన కానిస్టేబుల్. ఆమె శ్రీకాంత్ అనే వ్యక్తిని ప్రేమించి వివాహమాడింది. వీరు నవంబర్ 10న యాదగిరిగుట్టలో ప్రేమ పెళ్ళి చేసుకున్నారు. వివాహం తర్వాత నవదంపతులిద్దరూ హయత్‌నగర్‌లో నివాసం ఉంటున్నారు.
డిసెంబర్ 1 ఆదివారం నాడు సెలవు కావడంతో నాగమణి స్వగ్రామం వెళ్లింది. సోమవారం ఉదయాన్నే హయత్‌నగర్‌కు తిరుగుప్రయాణమైంది. ఆమెనే వెంబడించిన తమ్ముడు పరమేష్.. సరైన సమయం చూసుకుని హత్యకు పాల్పడ్డాడు. అనంతరం పోలీసుల దగ్గర లొంగిపోయాడు. దీంతో పోలీసులు పరమేష్‌ను అదుపులోకి తీసుకున్నారు.