దారుణం..ముళ్లపొదల్లో పురిటి తడి ఆరని పసిబిడ్డ

0
83

ఆ తండ్రికి ఏం కష్టమొచ్చిందో ఏమో తెలియదు గాని పురిటి తడి ఆరని రెండు రోజుల పసిగుడ్డును కర్కశంగా ముళ్లపొదల్లో వదిలేశాడో కన్నతండ్రి. ఈ దారుణం ఏపీలో చోటు చేసుకుంది.

పోలీసుల కథనం మేరకు..ఒంగోలు జిల్లా కొండపి మండలం కట్టవారి పాలెం గ్రామానికి చెందిన కాంతుల గంగ అనే మహిళ ఒంగోలులోని ఓ ప్రైవేటు వైద్యశాలలో సోమవారం పండంటి ఆడపిల్లకు జన్మనిచ్చింది. ఆడపిల్ల పుట్టడం ఆమె భర్త రమణకు ఇష్టం లేదు. దీంతో పాపను తీసుకుని మంగళవారం ఉదయం బయటికి వెళ్లాడు.

ఆసుపత్రిలో పసిపాపకు పరీక్షలు చేయిస్తానని చెప్పి
ఒంగోలు మంగమూరు రోడ్డులోని ముళ్ళ పొదల్లో వదిలేసి వెళ్లాడు. చిన్నారి అరుపులు విన్న స్థానికులు  చైల్డ్ లైన్ సిబ్బందికి సమాచారం అందించారు. చైల్డ్ లైన్ సిబ్బంది, తాలూకా పోలీసులు వెంటనే స్పందించారు. సంఘటన స్థలానికి చేరుకొని పాపను రక్షించారు. అనంతరం చికిత్స నిమిత్తం ఒంగోలు రిమ్స్‌కు తరలించారు. పాప ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని వైద్యులు తెలిపారు. పాపను ముళ్లపొదల్లో వదిలివెళ్లిన తండ్రిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.