గూగుల్ క్రోమ్ యూజర్లకు కేంద్రం హెచ్చరిక..ఎందుకో తెలుసా?

0
102

దేశంలో అత్యధికంగా ఉపయోగించే బ్రౌజర్ లలో గూగుల్ క్రోమ్ ఒకటి.. వ్యక్తిగత కంప్యూటర్‌లు మొబైల్ ఫోన్‌లలో ఈ క్రోమ్ బ్రౌజర్ వినియోగించే యూజర్లు అధికంగా ఉంటారు. అందుకే క్రోమ్ యూజర్లను సైబర్ నేరగాళ్లు టార్గెట్ చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో గూగుల్ క్రోమ్ యూజర్లకు కేంద్ర ఎలక్ట్రానిక్స్, సమాచార శాఖ పరిధిలోని కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (సీఈఆర్టీ) హెచ్చరిక జారీ చేసింది.

గూగుల్ క్రోమ్ దాడులకు లక్ష్యంగా మారినట్టు తెలిపింది. హ్యాకర్లు గూగుల్ క్రోమ్ లోని లోపాలను (బగ్ లు) అనుకూలంగా చేసుకుని ఎంపిక చేసుకున్న కంప్యూటర్లపై దాడిగి దిగుతున్నట్టు తెలిపింది. హ్యాకర్లు గూగుల్ క్రోమ్ లోని లోపాలను అనుకూలంగా చేసుకుంటే అప్పుడు క్రోమ్ యూజర్ల రక్షణ ప్రమాదంలో పడుతుందని పేర్కొంది. క్రోమ్ 98.0.4758.80 వెర్షన్ కంటే ముందు వెర్షన్లలోనే ఈ సమస్య ఉన్నట్లు సీఈఆర్టీ తెలిపింది. మరోవైపు గూగుల్ ఇప్పటికే అప్ డేటెడ్ వెర్షన్ ద్వారా ఈ లోపాలను సరి చేసింది.

27 సెక్యూరిటీ అంశాలకు పరిష్కారం చూపించింది. యూజర్లు గూగుల్ కొత్త వెర్షన్ కు అప్ డేట్ కావాలని సదరు సంస్థ సూచించింది. విండోస్ యూజర్లు అయితే గూగుల్ క్రోమ్ తాజా వెర్షన్ 98.0.4758.80/81/82 ను డౌన్ లోడ్ చేసుకోవాలి. మ్యాక్, లైనక్స్ యూజర్లు 98.0.4758.80 వెర్షన్ ను డౌన్ లోడ్ చేసుకోవాలని గూగుల్ సూచించింది. చాలా వరకు లోపాలకు పరిష్కారం చూపించినట్టు తెలిపింది