పోలీసు భార్యకు టోకరా : అకౌంట్ లో రూ. లక్ష మాయం

0
106

ఒక పోలీసు ఇంట్లో ఎవరైనా దొంగతనం చేయగలడా?

ఒక మోసగాడు పోలీసు ఫ్యామిలీని మోసం చేయగలడా?

ఒక రౌడీ పోలీసు కుటుంబాన్ని భయపెట్టగలడా?

ఈ ప్రశ్నలను ఎవరికి వేసినా… లేదు అని సమాధానం రాకపోవచ్చు కానీ చాలా కష్టం అని మాత్రం చెప్పగలరు. ఎందుకంటే పోలీసుల ఇంట్లో దోపిడీ చేయాలన్నా, వాళ్లను బెదిరించాలన్నా, మోసం చేయాలన్నా సాధారణ దొంగలకు గట్స్ చాలవు. కానీ సైబర్ దొంగలకు మాత్రం ఇవేవీ పట్టవు. ఎవరైతే ఏంటి అనేదే పాలసి వారిది. సైబర్ నేరస్తులకు పొరపాటున ఎవరైనా సరే బుట్టలో పడ్డారా? మాయ చేయడమే వారి పని. తాజాగా ఒక సిఐ సతీమణి బ్యాంక్ అకౌంట్ నుంచి సైబర్ నేరగాడు లక్షా, నాలుగు వేల సొమ్ము కాజేశాడు. ఈ ఘటన హైదరాబాద్ లో కలకలం రేపుతోంది. పూర్తి వివరాలు చదవండి.

ఆయన హైదరాబాద్ లోని సెంట్రల్ జోన్ లో ఒక పోలీస్ స్టేషన్ కు సిఐ. ఆయన ఎన్నో కేసులను తన తెలివితో చాకచక్యంగా పరిష్కరించిన అనుభవం ఉంది. కానీ ఆయన సతీమణికే ఒక సైబర్ కేటుగాడు టోకరా వేసి రూ.1.04లక్షలు కొట్టేశాడు. ఇటీవల సదరు సిఐ సతీమణి ఆన్ లైన్ లో 500 రూపాయల విలువ చేసే చీర కు ఆర్డర్ ఇచ్చారు. చీర డెలివరీ అనంతరం ప్యాకెట్ విప్పి చూస్తే ఆమె ఆర్డర్ ఇచ్చిన చీర రాలేదు. దీంతో సంబంధిత సంస్థను సంప్రదించడానికి గూగుల్ లోని కస్టమర్ కేర్ నంబరును తెలుసుకుని ఆ నెంబరుకు ఆమె కాల్ చేశారు.

ప్యాకింగ్ సమయంలో పొరపాటు జరిగి ఉంటుందని అవతలి వ్యక్తి రిప్లై ఇచ్చాడు. మీ డబ్బులు తిరిగి పంపిస్తానని బదులిచ్చాడు. ఆమె బ్యాంక్ ఖాతా నెంబరు తెలుసుకుని క్యూ ఆర్ కోడ్ పంపించాడు. దానిపై సదరు మహిళ క్లిక్ చేయగానే ఖాతాలోంచి 45వేలు మాయమయ్యాయి. ఇదేంటని ఆ నెంబరుకు కాల్ చేసి అడిగితే పొరపాటు జరిగిందంటూ బదులిచ్చి… మరో కోడ్ పంపించాడు. దానిపై క్లిక్ చేస్తే 25 వేలు ఒకసారి, 25 మరోసారి, 9వేలు ఇంకోసారి బ్యాంక్ అకౌంట్ నుంచి కట్ అయ్యాయి. ఇలా మొత్తం లక్షా 4వేల రూపాయలు దోచుకున్నాడు. అనంతరం బాధితురాలు సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తులో ఉంది.