ex sarpanch Suicide Attampt at tahsildar office in chittoor district: ఆయనో మాజీ సర్పంచ్.. సమస్యను పరిష్కరించండి మహాప్రభో అంటూ కాళ్లు అరిగేలా అధికారుల చుట్టూ, కార్యాలయాల చుట్టూ తిరిగాడు. ఎంతటికీ తన సమస్యను అధికారులు పరిష్కరించకపోవటంతో.. ఏకంగా తహసీల్దార్ కార్యాలయ గుమ్మానికే ఉరివేసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. అక్కడే ఉన్న సిబ్బంది, అధికారులు ఆయన్ని అడ్డుకొని, సమస్యను తెలుసుకున్నారు. ఈ ఘటన చిత్తూరు జిల్లా శాంతిపురం తహసీల్దార్ కార్యాలయంలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే, చిత్తూరు జిల్లా గ్రామ మాజీ సర్పంచ్ గోపాలప్ప.. తమ గ్రామంలో పొలాలకు వెళ్లే దారిని కొందరు కబ్జా చేశారని, దీని వల్ల పొలాలకు వెళ్లలేకపోతున్నామని అధికారులకు ఫిర్యాదు చేశారు. సంబంధిత అధికారులు సమస్యకు పరిష్కారం చూపాలని కార్యాలయాల చుట్టూ తిరిగినా, అధికారులను కలిసినా స్పందించలేదు.
దీంతో శాంతిపురం తహసీల్దార్ కార్యాలయం గుమ్మానికి ఉరివేసుకునేందుకు ప్రయత్నించాడు. అక్కడే ఉన్న సిబ్బంది, అధికారులు గోపాలప్పను అడ్డుకొన్నారు. సమస్య ఏమటో తెలుసుకున్న అధికారులు, రెండు రోజుల్లో పరిష్కరిస్తామని హామీ ఇవ్వటంతో, గోపాలప్ప వెనుదిరిగారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఓ ప్రజా ప్రతినిధికే అధికారులు స్పందించకపోతే.. ఇక సామాన్యుల పరిస్థితి ఏమటని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.