కట్ చేస్తే.. ఈజీ మనీ కోసం క్రిమినల్స్ తో కలిసి మాస్టర్ ప్లాన్ వేస్తాడు ఓ పోలీస్ అధికారి. ఓ బిగ్ షాట్ ని సెలెక్ట్ చేసుకుని తన గ్యాంగ్ తో కిడ్నాప్ చేయిస్తాడు. అతడి నుండి భారీ మొత్తంలో డబ్బు రాబడతాడు. అంతలోనే అతని బండారం బయటపడి సహచర పోలీసులతో బేడీలు వేయించుకుంటాడు. ఇలాంటి సీన్లు మనం చాలా సినిమాల్లో చూసి ఉంటాం. ఇప్పుడు అదే తరహాలో హైదరాబాద్ లో జరిగింది. ఓ ఎస్సై వ్యాపారవేత్తలను కిడ్నాప్ చేయించి దోపిడీకి పాల్పడ్డాడు. కానీ పోలీసులకు దొరికిపోయాడు. డిపార్టుమెంటుని షాక్ కి గురి చేసిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
హైదరాబాద్ పోలీసులు మహా కేటుగాళ్ల ముఠాని అదుపులోకి తీసుకున్నారు. సీఐడీ అధికారుల అంటూ కిడ్నాప్ లు చేసి దోపిడీలకు పాల్పడుతున్న గ్యాంగ్ ని అరెస్ట్ చేశారు. ఈ క్రమంలోనే CID ఆఫీసర్స్ అంటూ ఐటీ కంపెనీని బెదిరించి రూ. 10 లక్షలు కాజేసిన ముఠాను మాదాపూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలోని గచ్చిబౌలిలో జరిగింది. ఈ కేసుకు సంబంధించిన వివరాలను మాదాపూర్ DCP వినీత్ ప్రెస్ మీట్ లో వెల్లడించారు.
గచ్చిబౌలిలో ఏజేఏ యాడ్స్ అనే అమెరికన్ బేస్డ్ ఐటీ కంపెనీ ఉంది. దీన్ని దర్శన్, హరిప్రసాద్ అనే ఇద్దరు ఫ్రెండ్స్ మరి కొంతమందితో కలిసి నిర్వహిస్తున్నారు. అయితే AP CID అధికారులమని పది మంది గ్యాంగ్ సోమవారం కంపెనీలోకి వచ్చారు. మీరు మీ కంపెనీ ద్వారా చాలామందిని మోసం చేశారంటూ ఫేక్ ఐడీ కార్డులను చూపించి, బెదిరింపులకు పాల్పడ్డారు. రూ. 10 కోట్ల రూపాయలు కూడా డిమాండ్ చేశారు. అనంతరం కంపెనీ మేనేజ్మెంట్ టీమ్ లోని దర్శన్, హరిప్రసాద్ లను కిడ్నాప్ చేసి ఓ హోటల్ కి తీసుకెళ్ళారు. అక్కడ వారి నుండి రూ. 10 లక్షలు తమ ఖాతాల్లోకి ట్రాన్స్ ఫర్ చేయించుకున్నారు. కాగా వీరిలో కర్నూల్ డీజీపీ ఆఫీస్ లో పని చేస్తున్న ఎస్సై సుజన్, ఏజేఏ యాడ్స్ కంపెనీ మాజీ ఉద్యోగి కూడా ఉండటం గమనార్హం. అంతేకాదు ఈ కిడ్నాప్ వ్యవహారం మొత్తం ప్లాన్ చేసిన మాస్టర్ బ్రెయిన్ కూడా ఎస్సై సుజన్. పోలీసులు ఎస్సై సుజన్, రంజిత్ తో సహా కిడ్నాప్ ముఠాను అరెస్ట్ చేశారు.