విదేశీ యువతిపై అత్యాచారయత్నం..గంటల వ్యవధిలోనే నిందితుల అరెస్ట్

0
147

దేశంలో రోజురోజుకు దారుణాలు పెరిగిపోతున్నాయి. తాజాగా ఏపీలోని నెల్లూరు జిల్లాలో దారుణం జరిగింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున ఓ విదేశీ యువతిపై అత్యాచారయత్నం రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపింది. కేసు నమోదు చేసిన పోలీసులు ఈ ఘటనను సవాల్ గా తీసుకున్నారు. ఆమె చెప్పిన వివరాల ఆధారంగా నిందితుల కోసం గాలించారు. కేవలం ఆరు గంటల వ్యవధిలోనే ముద్దాయిలను పోలీసులు అరెస్ట్ చేశారు.

అసలేం జరిగిందంటే?

లితుయేనియా దేశానికి చెందిన ఓ యువతి గోవా వెళ్లేందుకు శ్రీలంక నుంచి చెన్నైకి చేరుకుంది. బెంగళూరు వెళ్తుండగా బస్సులో సదరు మహిళను నెల్లూరు జిల్లాకు చెందిన సాయి కుమార్‌ పరిచయం చేసుకున్నాడు. కృష్ణపట్నం జీవితంలో ఒక్కసారి అయినా సందర్శించాలి అంటూ ఆ మహిళకు మాయమాటలు చెప్పి మభ్యపెట్టాడు. అనుకున్న ప్లాన్ ప్రకారం ఉదయం 8 గంటల ప్రాంతంలో విదేశీ మహిళతో కలిసి గూడూరుకు చేరుకున్నాడు సాయికుమార్‌.

అక్కడి నుండి తన స్నేహితుడు షేక్ అబిద్ తో కలిసి మహిళను బైక్ పై ఎక్కించుకుని సైదాపురం అడవుల్లోకి తీసుకెళ్లాడు. నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లిన ఈ ఇద్దరు ఆమెపై అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. వారి చెర నుండి తప్పించుకున్న కరోలినా స్థానికుల సాయంతో పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఈ ఘటనను సీరియస్ గా తీసుకున్నారు.

SPS నెల్లూరు జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ శ్రీ విజయ రావు,IPS, ఆదేశముల మేరకు గూడూరు DSP, గూడూరు రూరల్ CI పర్యవేక్షణలో సైదాపురం SI, మనుబోలు SI రెండు టీములుగా ఏర్పడి చివరకు ముద్దాయిలను చిల్లకూరు జంక్షన్ వద్ద అదుపులోకి తీసుకున్నారు. కేవలం ఆరు గంటల వ్యవధిలోనే నిందితులు అయిన మనుబోలు చెందిన సాయి, గూడూరు చెందిన అబీద్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటనపై చాకచక్యంగా వ్యవహరించిన గూడూరు డి.యస్.పి., గూడూరు రూరల్ CI, సైదాపురం, మనుబోలు పోలీసులను జిల్లా SP విజయ రావు అభినందించారు.