పెట్రోల్‌ బంకుల్లో గప్ ‘చిప్’ మోసం..విస్తుపోయే నిజాలివే

0
123

పెట్రోల్‌ బంకుల్లో అమర్చిన ఒక చిన్న చిప్‌..వినియోగదారుడి కన్ను గప్పేస్తుంది. లీటరు పెట్రోల్‌పై 50 ఎంఎల్‌ తగ్గించేస్తుంది. మనకు తెలియకుండానే మోసం చేసేస్తుంది. కానీ, వినియోగదారుడికి మాత్రం మీటరు లీటరుగానే చూపిస్తుంది. తగ్గేది 50 ఎంఎల్‌ మాత్రమే కాబట్టి మైలేజీలో వచ్చే చిన్నపాటి తగ్గుదలను గుర్తించలేరు. కానీ, రోజుకు వేల లీటర్లు అమ్మకాలు జరిపే బంకుల యజమానులకు మాత్రం ఇది భారీ ఆదాయాన్నే తెచ్చిపెడుతోంది.

తెలంగాణ, ఏపీ, కర్ణాటకల్లోని 34 బంకుల్లో గప్‌’చి్‌ప’గా సాగిపోతున్న ఈ ఘరానా మోసాన్ని పోలీసులు రట్టు చేశారు. పెట్రోల్‌ బంకుల్లో చిప్‌లు అమర్చి భారీ మోసాలకు పాల్పడుతున్న ఓ అంతరాష్ట్ర ముఠాను బాలానగర్‌ డివిజన్‌ పోలీసులు గురువారం అరెస్ట్‌ చేశారు. వీరి వద్ద నుంచి పెట్రోల్‌ బంకులకు అమర్చే 67 రకాల వస్తువులు, ఆరు కార్లు, రెండు ల్యాప్‌టాప్ లను స్వాధీనం చేసుకున్నారు.

పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం..జగద్గిరిగుట్టలోని షిర్డీహిల్స్‌కు చెందిన మెకానిక్‌ ఎం.డీ. ఫైజల్‌ బారీ, అల్వాల్‌ కానాజీగూడ, గ్రీన్‌ఫీల్డ్‌కు చెందిన కురాదే సందీప్‌, చాంద్రాయణగుట్ట, బండ్లగూడ సమీపంలోని రహమత్‌నగర్‌కు చెందిన ఎం.డి అస్లాం, భువనగిరి జిల్లా వలిగొండ మండలం, లింగరాజ్‌పల్లికి చెందిన వ్యాపారి కలిమేర నర్సింగరావు గతంలో వివిధ పెట్రోల్‌ బంకుల్లో పనిచేశారు. వీరికి ఆ మెషీన్‌ల పనితీరుపై పూర్తి అవగాహన ఏర్పడింది.

దీంతో గుజరాత్‌ వెళ్లి సూరత్‌లో ఉండే చిప్‌ల డీలర్‌ జయేశ్‌ అనే వ్యక్తి ద్వారా తమకు కావలసిన చిప్‌లను తయారు చేయించుకున్నారు. ఈ చిప్‌లను నాలుగు నెలల్లో తెలంగాణ, ఏపీ, కర్ణాలకల్లోని 34 పెట్రోలు బంకుల యజమానులకు విక్రయించారు. ఈ మోసంపై సమాచారం అందుకున్న ఎస్‌వోటీ పోలీసులు.. తీగ లాగారు. దీంతో..డొంకంతా కదిలింది. ఈ చిప్‌లు అమర్చుకుని మోసాలకు పాల్పడుతున్న పెట్రోలు బంకుల్లో..టీఎ్‌స్ఆర్టీసీ నిర్వహిస్తున్న పెట్రోలు బంకులు కూడా ఉండడం విశేషం.

జీడిమెట్లలోని లక్ష్మీగణేష్‌ ఫ్యూయల్‌ స్టేషన్‌, శంషాబాద్‌ గగన్‌పహాడ్‌ సమీపంలోని ఐఓసీ మౌల సర్వీస్‌ స్టేషన్‌ నిర్వాహకుడు నాగండ్ల వెంకటేశ్‌ అలియాస్‌ చంటి, శామీర్‌పేట్‌ ప్రాంతలోని హకీంపేట్‌ గ్రామం, టీఎ్‌సఆర్‌టీసీ ఐఓసీ అసిస్టేట్‌ మేనేజర్‌ వంద్యాల వంశీధర్‌రెడ్డి, మేడ్చెల్‌ పూడురు ప్రాంతంలోని ఐఓసీ హరిహర ఫిల్లింగ్‌ స్టేషన్‌ మేనేజర్‌ రంగు రమేశ్‌, ఐఓసీ జీఎంఆర్‌ ఫిల్లింగ్‌ స్టేషన్‌ మైలారదేవ్‌పల్లి సూపర్‌ వైజర్‌ బీరవల్లి మహేశ్వరర్‌రావులను కూడా పోలీసులు అరెస్టు చేశారు.