కొత్తగా పెళ్లై ఇంటికి వచ్చిన భార్యను పుట్టింటికి పంపించేసిందని, సొంత తల్లిపై కక్ష పెంచుకున్నాడు ఆ కొడుకు. తాగి ఇంటికి వస్తే తిడుతోందని కోపం తెచ్చుకున్నాడు ఆ భర్త. దీంతో తండ్రి, కొడుకులు ఇద్దరు కలిసి ఆమెను హత్య చేశారు. ప్రమాదవశాత్తు మరణించినట్టు చిత్రీకరించే ప్రయత్నం చేశారు. చివరికి పోలీసులకు చిక్కారు. ఈ ఘటన తమిళనాడులో జరిగింది.
వివరాల్లోకి వెళితే..మురుగన్(49), శంకరమ్మళ్(47) దంపతులు తిరునల్వేలి జిల్లా జమీన్ సింగపట్టిలో నివాసముంటున్నారు. వీరికి ఇద్దరు సంతానం. 10 నెలల క్రితం తన కొడుకు తలవైసామి(25)కి.. సోదరుడి కూతురు పూవితతో వివాహం జరిపించింది శంకరమ్మళ్. పూవిత ప్రస్తుతం డిగ్రీ మూడో సంవత్సరం చదువుతోంది. ఇంట్లో ఉంటే చదువుకు ఇబ్బంది అవుతుందని భావించిన శంకరమ్మళ్.. పూవితను పుట్టింటికి పంపించింది. డిగ్రీ పూర్తయిన తర్వాత ఇంటికి తీసుకెళతామని మాటిచ్చింది. దీంతో పూవిత పుట్టింటికి వెళ్లిపోయింది.
ఈ వ్యవహారం కొత్తగా పెళ్లైన తలవైసామికి గిట్టలేదు. భార్యను పుట్టింటికి పంపించడంపై తల్లితో గొడవపడటం మొదలుపెట్టాడు. తండ్రి మురుగన్ కూడా కొడుకుతో జతకట్టాడు. తాగేసొచ్చి భార్యను కొట్టేవాడు. ఇలా కొన్ని రోజులు గడిచింది. ఓ రోజు అనూహ్యంగా ఊరిలో అందరిని పిలిపించాడు మురుగన్. తన భార్య నిద్రలో మంచం మీద నుంచి కిందపడిందని, ముక్కు నేలకు బలంగా తగలడం వల్ల చనిపోయిందని చెప్పాడు. కానీ భార్య-భర్తల మధ్య అప్పటికే ఉన్న గొడవల గురించి తెలిసిన ఊరి జనం ఆ మాటలు నమ్మలేదు. తండ్రి-కొడుకులు బాగా తాగుతారని వారికి తెలుసు. దీంతో అనుమానం వచ్చి కలైడైకురిచి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాదీనం చేసుకుని పంచనామా కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తండ్రి, కొడుకులను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు.
విచారణలో భాగంగా ఇద్దరు నిజాన్ని బయటపెట్టారు. తామే హత్య చేసి.. పూర్తి వ్యవహారాన్ని ఓ ప్రమాదంగా చిత్రీకరించాలని చూసినట్టు అంగీకరించారు. రోజు తాగేసి వచ్చే భర్తను శంకరమ్మళ్ బాగా తిట్టేది. అటు భార్యను దూరం చేసిందని తల్లిపై కొడుకు కక్ష పెట్టుకున్నాడు. దీంతో వారిద్దరు కలిసి ఈ హత్య చేశారు. అని పోలీసులు వెల్లడించారు. ఇద్దరిని త్వరలో కోర్టు ముందు హాజరుపరచనున్నట్టు పోలీసులు స్పష్టం చేశారు.