ఆప్ఘనిస్థాన్లో అమెరికా బలగాలు వెనక్కి వెళ్లిపోతున్నాయి. మళ్లీ తాలిబన్ల ఆధిపత్యం అక్కడ పెరిగేలా కనిపిస్తోంది. 20 ఏళ్లుగా కాస్త ప్రశాంతంగా ఉన్న ఆ ప్రాంతం వచ్చే రోజుల్లో ఎలా ఉంటుందా అని అందరూ ఆలోచన చేస్తున్నారు. ఇప్పటికే ఆప్ఘనిస్థాన్లోని చాలా భాగం తాలిబన్ల వశమైనట్టు ఇంటర్నేషనల్ వార్తా పత్రికల్లో వార్తలు వస్తున్నాయి.
ఆ దేశంలోని మత నాయకులకు తాలిబన్లు ఓ డిమాండ్ చేశారట. తమ ప్రాంతంలోని 15 సంవత్సరాలు దాటిన అమ్మాయిలు, 45 ఏళ్ల వయసులోపల ఉన్న వితంతువుల వివరాలు ఇవ్వాలని అడిగారని
తెలుస్తోంది. ఈ అమ్మాయిలకి గ్రూప్ లోని వారితో పెళ్లి చేసి పాకిస్థాన్ కు పంపుతామని, ఆఫ్ఘన్ మత నేతలను కోరారని వార్తలు వెలువడుతున్నాయి.
ప్రస్తుతం ఆప్ఘన్ భద్రతా దళాలు తాలిబన్లను తిప్పికొట్టలేకపోతున్నాయి. మహిళలు బయటికి రాకూడదని, పురుషులందరూ గడ్డాలు పెంచాలని తాలిబన్లు ఇటీవల తఖర్ జిల్లాలో ప్రజలకు ఆదేశాలు జారీ చేశారు.ఇక వీరు మరిన్ని కఠిన నిబంధనలు పెడతారు అని జనం భయపడుతున్నారు. గతంలో తాలిబన్ల పాలనలో ఇక్కడ ప్రజలకు అనేక కఠిన నియమాలు పెట్టారు.అమ్మాయిలు చదవకూడదు, ఇంట్లోనే ఉండాలి, బయటకు రాకూడదు, ఇక పురుషుడు ఉంటేనే బయటకు అడుగుపెట్టాలి ఇలాంటి రూల్స్ ఉండేవి, ఇవి ఎవరైనా మీరితే బహిరంగంగా శిక్షలు వేశారు.