పారాసెయిలింగ్‌ చేస్తుండగా తెగిపోయిన తాడు..సముద్రంలో పడిపోయిన భార్యాభర్తలు (వీడియో)

0
114

కొందరికి నీళ్లంటేనే భయం. అలాంటిది సముద్రంపై పారాచూట్‌ సాయంతో గాల్లోకి ఎగరడం అంటే భయంతో కూడిన సాహసమే. అన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ఒకవేళ సముద్రంలో పడిపోతే తమ పరిస్థితి ఏంటని ఆందోళన చెందుతూనే ఉంటారు. మరి అలాంటిది గాల్లో ఉండగా..పారాసెయిలింగ్‌ తాడు తెగిపోయి వారు సముద్రంలో పడిపోతే..ప్రాణాలు ఉంటాయో, గాల్లో కలిసిపోతాయోనని వారు పడే భయాందోళన ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. అలాంటి పరిస్థితే ఎదురైంది ఓ జంటకు.

గుజరాత్‌కు చెందిన అజిత్‌ కథడ్‌ (30), సరళా కథడ్‌ (31) దంపతులు హాలిడే ట్రిప్‌ కోసం ఆదివారం దయూలోని నంగావ్‌ బీచ్‌కు వెళ్లారు. అక్కడ పారాసెయిలింగ్‌ చేయాలని ఆశపడ్డారు. నిర్వాహకులు పవర్‌ బోటు నుంచి వారిని పారాచూట్‌లో పైకెగిరేశారు. అయితే వారు పైకి వెళ్లిన కొద్దిసేపటికే పవర్‌ బోటుకు, పారాచూట్‌కు అనుసంధానంగా ఉన్న తాడు ఒక్కసారిగా తెగిపోయింది. వారు కొద్దిదూరం వెళ్లి సముద్రంలో పడిపోయారు. దీంతో అక్కడ ఒక్కసారిగా భయాందోళన వాతావరణం నెలకొంది. బోటులో ఉన్న అజిత్‌ కథడ్‌ సోదరుడు రాకేశ్‌ భయంతో అరవడంతో అప్రమత్తమైన సిబ్బంది వెంటనే నీటిలో దూకి వారిని రక్షించారు. లైఫ్‌ జాకెట్లు వేసుకోవడంతో వారు నీటిలో మునిగిపోలేదు. వారికి ఎలాంటి గాయాలు కూడా కాలేదు. ఈ ఘటనకు సంబంధించిన ఓ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

‘నా సోదరుడు గాల్లోకి ఎగురుతుండగా నేను వీడియో తీస్తున్నాను. కానీ తాడు తెగిపోవడంతో ఏం చేయాలో అర్థం కాలేదు’ అని రాకేశ్‌ పేర్కొన్నాడు. తాడు బలహీనంగా ఉందని, తెగిపోతుందేమోనని ఈ ఫీట్‌కు ముందే సిబ్బందిని హెచ్చరించినట్లు ఆయన రిపోర్టర్లతో పేర్కొన్నాడు. కానీ ఏం కాదని వారు తనతో చెప్పినట్లు తెలిపాడు. దీనిపై అజిత్‌ స్పందిస్తూ ‘మా ప్రాణం పోయినంత పనైంది. నిర్వాహకుల నిర్లక్ష్యంతోనే ఈ ఘటన జరిగింది. మా కుటుంబం ఇంకా షాక్‌లోనే ఉంది’ అని పేర్కొన్నాడు.

వీడియో చూడడానికి కింది లింక్ ను క్లిక్ చేయండి.

https://www.facebook.com/alltimereport/videos/366596508567809