కిలాడీ డాక్టర్ మోసం..న్యాయం కోసం జవాన్ ఎదురుచూపులు

Kiladi doctor cheating..Jawan waits for justice

0
115

మనిషి ఆశ ఎంత పనైనా చేయిస్తుంది. సులువుగా డబ్బు వస్తుందని ఆశించి జీవితాలు పాడు చేసుకున్న వారు ఎంతో మంది ఉన్నారు. అయినా మోసాలు తగ్గడం లేదు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రోజు రోజుకూ పెరుగుతున్నాయి. మోసగాళ్లు కొత్త దారులు వెతుక్కొని మోసాలు చేస్తున్నారు. మిలటరీ విశ్రాంత ఉద్యోగిని మోసం చేసిన కిలాడీ నకిలీ డాక్టర్ వ్యవహారం గుంటూరు జిల్లాలో వెలుగు చూసింది.

తాడేపల్లి ఇప్పటంకి చెందిన మిలటరీ ఉద్యోగి కార్తీక్ భార్యకు ఆరోగ్య పరిస్థితి బాగా లేకపోవడంతో ఉద్యోగం మానేసి కొంతకాలం నుంచి ఇంటి దగ్గరే ఉంటున్నారు. అయితే, పిజియోథెరపీ డాక్టర్ పేరుతో పరిచయమైన రోజా అనే మహిళ కార్తీక్ భార్యకు కొంతకాలం వైద్య సేవలు అందించింది. ఈ క్రమంలో కార్తిక్ కుటుంబ సభ్యులకు చాలా దగ్గరైంది. ఆ చనువును ఆసరాగా చేసుకున్న ఫిజియోథెరపిస్ట్ రోజా ఇదే అదునుగా భావించి..తాను పెద్ద హాస్పిటల్ పెట్టబోతున్నామని, కోటిన్నర లోన్ వస్తుందని వారిని నమ్మబలికింది. అది నమ్మిన కార్తిక్ కుటుంబ సభ్యులు దాదాపు రూ. 60 లక్షల వరకు నగదు, పది లక్షల వరకు బంగారం, సొంత ఇంటి కాయితాలు సైతం తాకట్టు పెట్టి ఆమెకు డబ్బులు ఇచ్చారు. ఇంత చేసిన తరువాత ఆ ఫిజియోథెరపిస్ట్ తనకేం తెలియందూ బాంబ్ పేల్చింది.

పైగా డబ్బులు ఇచ్చేది లేదంటూ తెగేసి చెప్పడమే కాకుండా ఎస్ఐ‌ని పెళ్లి చేసుకుని అతని అండతో రివర్స్ బెదిరింపులకు దిగింది. దాంతో బాధిత కుటుంబం రోడ్డున పడింది. డబ్బులు తీసుకుని కుటుంబాన్ని మోసం చేసిన మహిళ..పెదకాకాని ఎస్ఐ వినోద్ కుమార్‌ను వివాహం చేసుకుంది. ఎస్ఐ వినోద్ అండతో ఆమె మరింత రెచ్చిపోయింది. బాధిత కుటుంబాన్ని మరింత వేధింపులకు గురి చేసింది. అంతేకాదు..వారి డబ్బులు ఇవ్వకపోగా అప్పు చేస్తే ఇవ్వాల్సిన రూలేమీ లేదని, మీకు చేతనైంది చేసుకోండి అంటూ ఎస్ఐ వినోద్ కుమార్ బాధిత కుటుంబానికి వార్నింగ్ ఇచ్చాడు. దాంతో బాధితులు దిక్కుతోచని స్థితిలో పోలీసు ఉన్నతాధికారులను ఆశ్రయించారు.

సంపాదించిందంతా పోవడంతో తమ కుటుంబానికి ఆత్మహత్య తప్ప మరో మార్గం లేదని కన్నీటి పర్యంతం అయ్యారు. మిలటరీలో సేవలందించి దాచుకున్న డబ్బును మహిళ కాజేయడంతో పాటు ఎస్సై వినోద్ కుమార్ నుంచి బెదిరింపులు వస్తుండటంతో కార్తిక్ కుటుంబ సభ్యులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. పెళ్లికి ముందే ఎస్ఐతో ప్రేమలో ఉంటూ..ఇద్దరూ కలిసి మోసానికి పాల్పడ్డారని ఆరోపించారు. తమకు న్యాయం చేయాలని అధికారులను కార్తీక్ కుటుంబ సభ్యులు వేడుకుంటున్నారు.

దేశ సరిహద్దుల్లో రక్షణగా ఉన్న జవాన్ ఇప్పుడు న్యాయం కోసం ఎదురు చూపులు చూడాల్సి వచ్చింది. ప్రజలకు న్యాయం చేయాల్సిన ఎస్ఐ ఆయన డాక్టర్ భార్యకు అండగా ఉండడంతో తమకు న్యాయం జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇచ్చిన డబ్బు తిరిగి అడిగితే సివిల్ కేసు అంటూ న్యాయస్థానంలో తేల్చుకోవాలంటూ బుకాయించిన ఎస్ఐ వినోద్. ఇప్పటికే కిలాడి డాక్టర్ పై మంగళగిరి లో మూడు కేస్ లు నమోదైనట్టు తెలుస్తోంది.