Murder: కృష్ణా నది వెనుక జలాల్లో లభ్యమైన యువకుడి మృతదేహం ఆధారంగా బాగల్‌కోట పోలీసులు ఓ ప్రేమజంట మృతి రహస్యాన్ని చేధించారు. వివరాల్లోకి వెళ్తే, కర్ణాట రాష్ట్రంలోని విజయపుర జిల్లా తికోటా తాలూకా ఘోణసగి గ్రామానికి చెందిన మల్లికార్జున జమఖండి (20) కల్లవటగికి చెందిన గాయత్రి (18) ప్రేమికులు. విజయపురకు కళాశాలకు బస్సులో వెళ్లి వచ్చే సమయంలో ఏర్పడిన పరిచయం కాస్తా వీరిద్దరి మధ్య ప్రేమగా మారింది. ఇదిలా ఉండగా సెప్టెంబర్ 23న మల్లికార్జున గాయత్రి ఇంటికి వెళ్లాడు. పొలంలో ఉన్న ఇంటి పక్కనే ఉన్న ఓ గదిలో వారిద్దరూ మాట్లాడుకుంటుండగా, సదరు యువతి తండ్రి గురప్ప గమనించాడు. వెంటనే ఆ గదికి తాళం వేశాడు. దీంతో యువతి భయంతో, అక్కడే ఉన్న పురుగుల మందును తాగేయటంతో అక్కడికక్కడే మరణించింది. కొద్ది సమయం తరువాత యువతి తండ్రి గురప్ప, బంధువులు అజిత్, మల్లప్ప వచ్చారు.
యువతి చనిపోయి ఉండటంతో, కోపంతో యువకుడిని స్తంభానికి కట్టేసి.. బలవంతంగా పురుగుల మందు తాగించారు. అనంతరం ప్రేమికుల మృతదేహాలను వేర్వేరు సంచుల్లో కట్టి, సెప్టెంబర్ 24 కొర్తికొల్లార వంతెన వద్ద కృష్ణా నదిలో పడేశారు. తరువాత ఏమీ తెలియనట్లు తమ కుమార్తె కనిపించటం లేదంటూ తికోటా పోలీసులకు యువతి తండ్రి అక్టోబర్ 5న ఫిర్యాదు చేశారు. తమ కుమారుడు కూడా అదృశ్యం అయ్యాడంటూ కుటుంబసభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నారు పోలీసులు. అక్టోబర్ 10న బీళగి వద్ద యువకుడు మృతదేహం లభించటం, అతడి మృతదేహంపై ఉన్న టీ షర్టు ఆధారంగా వివరాలు సేకరించగా, అసలు విషయం బయటపడింది. మెుదటిగా యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడని అనుకున్నా.. ప్రేమికుల్లో ఒకరు ఆత్మహత్య చేసుకోగా, మరొకర్ని హత్య (Murder)చేసినట్లు తేలింది. దీంతో నిందితులను అరెస్టు చేసి పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు.