పెళ్లి పత్రికలో పేర్లు అచ్చు వేయలేదని… దారుణానికి తెగబడ్డారు

0
117

పెళ్లి పత్రికలో పేర్ల కోసం జరిగిన ఘర్షణ కత్తిపోట్లకు దారితీసింది. సికింద్రాబాద్ లోని తుకారాం గేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చంద్రశేఖర్ నగర్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. నలుగురికి గాయాలు కాగా ఇద్దరి పరిస్థితి సీరియస్ గా ఉందని వైద్యులు తెలిపారు. దాడి చేసిన నిందితులు పరారీలో ఉన్నారు. పూర్తి వివరాలు…

మూడు రోజుల క్రితం సికింద్రాబాద్ చంద్రశేఖర్ నగర్ కు చెందిన సురేష్ అనే వ్యక్తి వివాహం జరిగింది.  అయితే పెళ్లి పత్రికలో తమ పేర్లు ఎందుకు పెట్టలేదని పెళ్లిరోజే సర్వేశ్ కుటుంబసభ్యులతో గొడవకు దిగాడు. ఈ సందర్భంగా పెళ్లికొడుకు సురేష్ సోదరి బాలమణిని తిట్టాడు. ఆ సమయంలో బంధువులందరూ సర్దిచెప్పి పెళ్లి అయిన తర్వాత మాట్లాడదామన్నారు.

ఇవాళ ఉదయం బాలమణి తన కుటుంబ సభ్యులు, పెళ్లికి వచ్చిన బందువులను తీసుకొని సర్వేశ్ ఇంటికి వెళ్ళింది. సర్వేశ్ సోదరుడు శేఖర్ వచ్చిన వారిపైకి రెచ్చిపోయాడు. సర్వేశ్ కు ఆయన తల్లి కత్తి ఇచ్చిందని.. ఆ కత్తితో తమపై విచక్షణ రహితంగా దాడి చేశాడని బాలమణి కుటుంబసభ్యులు తెలిపారు. సర్వేశ్ చేతిలోని కత్తి తీసుకొని శేఖర్ కూడా దాడి చేశాడని తెలిపారు.

ఈ దాడిలో ఎస్ ప్రవీణ్ (30) నోముల పరశురాము(35)  డి యాదగిరి, (42)ఎన్ ప్రతాప్ కుమార్ (32) తీవ్రగాయాల పాలయ్యారు. బాధితులు గాయాలతోనే పోలీస్ స్టేషన్ వచ్చి ఫిర్యాదు చేశారు. దారి పొడవునా పోలీస్ స్టేషన్ లో సైతం రక్తం మరకలు ఉన్నాయి. పోలీసులు వెంటనే బాధితులను ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. నిందితులు అప్పటికే పరారయ్యారు. ఇందులో విఆర్ఏ ఎస్ ప్రవీణ్, నోముల పరశురాము పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.. పోలీసులు కేస్ నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.