Mentally challenged man kills mother in jammu kashmir: జమ్మూ కశ్మీర్ లో దారుణ ఘటన చోటు చేసుకుంది. నగ్నంగా తిరగొద్దని మందలించినందుకు తల్లితోపాటు, మరో ఇద్దరిని హత్య చేశాడు ఓ కొడుకు. ఈ ఘటన స్థానికంగా సంచలనం రేపింది. వివరాల్లోకి వెళితే జమ్మూ కాశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లాలో అష్ముకం గ్రామంలో కుటుంబంతోపాటు నివసిస్తున్నాడు జావిద్ అహ్మద్. స్థానికంగా ఉండే బేకరీలో బేకర్ గా పని చేస్తున్నాడు.
అయితే కొంతకాలంగా అతని ప్రవర్తనలో మార్పు వచ్చింది. దీంతో అతని మానసిక పరిస్థితి బాలేదని ఇంట్లోనివారు గ్రహించారు. ఈ క్రమంలోనే శుక్రవారం మధ్యాహ్నం నగ్నంగా బయటకి వెళ్లేందుకు ప్రయత్నించాడు. అలా వెళ్లొద్దంటూ జావిద్ తల్లి హఫీజా బేగం అడ్డుకునే ప్రయత్నం చేసింది. దీంతో ఆమెను పక్కనే ఉన్న కట్టె తీసుకుని ఇష్టమొచ్చినట్టు కొట్టడం మొదలుపెట్టాడు జావిద్. తీవ్రగాయాలపాలైన తల్లి హఫీజా అక్కడికక్కడే మరణించింది. ఆమె అరుపులు విని ఇరుగుపొరుగువారు అక్కడికి చేరుకుని, జావిద్ ని నిలువరించే ప్రయత్నం చేశారు. అయితే వారిపైన కూడా అతను విచక్షణా రహితంగా దాడికి పాల్పడ్డాడు.
ఈ దాడిలో మహ్మద్ అమీన్ షా, గులాం నబీ ఖాదీమ్ మరణించగా మరికొందరు గాయాలపాలయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. కాగా, ముందురోజు కూడా చుట్టుప్రక్కల ప్రాంతాల్లో జావిద్ నగ్నంగా తిరిగినట్టు స్థానికులు చెబుతున్నారు. ఈ క్రమంలో మార్కెట్ లో తిరుగుతుండగా సమాచారం అందుకున్న పోలీసులు.. అక్కడికి చేరుకుని, అతనికి కౌన్సిలింగ్ ఇచ్చి కుటుంబసభ్యులకు అప్పగించారు. ఇది జరిగిన మరుసటి రోజే జావిద్, నగ్నంగా తిరగొద్దని అడ్డుకున్నందుకు తల్లితోపాటు మరో ఇద్దరిని క్రూరంగా దాడి చేసి హతమార్చడం స్థానికుల్ని కలచివేస్తోంది.