Deepthi Murder | తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన జగిత్యాల జిల్లా కోరుట్ల సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ దీప్తి మృతి కేసులో మిస్టరీ వీడింది. దీప్తిని చంపింది ఆమె చెల్లెలు చందనే అని పోలీసులు నిర్ధారించారు. మొత్తం ఐదుగురు నిందితులను అరెస్ట్ చేశారు. ఈ కేసు వివరాలను జిల్లా ఎస్పీ భాస్కర్ మీడియాకు వెల్లడించారు. 2019లో హైదరాబాద్‌లోని ఓ కాలేజీలో ఇంజనీరింగ్ చేరిన చందనకు ఉమర్ సుల్తాన్ అనే వ్యక్తి పరిచమయ్యాడని.. ఆ పరిచయం ప్రేమగా మారిందన్నారు. అయితే గత నెల 19న కోరుట్లకు వచ్చిన ఉమర్‌ను పెళ్లి చేసుకోవాలని చందన కోరగా.. సెటిల్ కావాలంటే డబ్బులు కావాలని అడిగాడన్నారు. ఈ నేపథ్యంలో చందన తన ఇంట్లో ఉన్న డబ్బులు, బంగారంతో పారిపోవాలని ప్లాన్ వేసిందని తెలిపారు. ప్లాన్ లో భాగంగా చందన తన అక్క దీప్తికి వోడ్కా తాగించిందన్నారు. దీప్తి మత్తులోకి జారుకున్నాక ఇంట్లో ఉన్న ఆభరణాలు, డబ్బుతో పారిపోవాలని భావించిందన్నారు.
ఈ సమయంలో ఇంట్లో ఉన్న నగదు, బంగారం తీస్తుండగా.. దీప్తి చూసి కేకలు వేసింది. దీంతో దీప్తి ముక్కు, నోటికి ప్లాస్టర్ వేశారని.. 10 నిమిషాల తర్వాత ఆమె చనిపోయిందని నిర్థారించుకున్నారన్నారు. అనంతరం పారిపోయేటప్పుడు నోటికి ప్లాస్టర్ తీసి సహజమరణంగా చిత్రీకరించే ప్రయత్నం చేశారని ఎస్పీ వెల్లడించారు. ఆర్మూర్-బాల్కొండ రూట్‌లో నిందితులు పట్టుకున్నామని.. వారి నుంచి బంగారంతో పాటు నగదును రికవరీ చేసినట్లు ఆయన పేర్కొన్నారు.
ఈ కేసు( Deepthi murder)లో ఏ-1గా చందన, ఏ-2గా ఉమర్ షేక్ సుల్తాన్(అడ్డగుట్ట, ప్రగతి నగర్, హైదరాబాద్), ఏ3-గా సయ్యద్ అలీ మహబూబ్(ఉమర్ తల్లి), ఏ4-గాషేక్ అసియా ఫాతిమా(ఉమర్ చెల్లి), ఏ-5గా హఫీజ్(ఉమర్ ఫ్రెండ్) లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.