సౌదీలో రోడ్డు ప్రమాదం..చిత్తూరు వాసులు మృతి

0
127

సౌదీలో జరిగిన రోడ్డు ప్రమాదం చిత్తూరు జిల్లాకు చెందిన ప్రవాసి కుటుంబంలో విషాదం నింపింది. ఈ ప్రమాదంలో భార్య, కుమార్తె ప్రాణాలు కోల్పోగా, భర్తకు గాయాలయ్యాయి. చిత్తూరు జిల్లాకు చెందిన కంగన సభాపతి కుటుంబం రెండున్నర దశాబ్దాలుగా సౌదీలో నివసిస్తోంది. రియాధ్‌ నగరంలో మెకానికల్‌ ఇంజినీర్‌గా పని చేస్తున్న సభాపతి మంగళవారం పారిశ్రామిక నగరం జుబేల్‌కు కుటుంబంతో కారులో ప్రయాణిస్తుండగా అల్‌హాసా పట్టణం వద్ద కారు ప్రమాదానికి గురైంది. భార్య మలార్‌(50), ఏకైక కుమార్తె శ్యామ(21) ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోగా, సభాపతి స్వల్ప గాయాలతో బయటపడ్డారు.

ఇద్దరి మృతదేహాలతో సభాపతి శనివారం స్వదేశానికి బయలుదేరారు. న్యూయార్క్‌లోని కోన్కోరిడా బిజినెస్‌ కళాశాలలో ఫైనాన్స్‌ చదివిన శ్యామ కీలక ఎక్సెల్‌ షీట్ల రూపకల్పనలో ప్రధాన భూమిక వహించడంతో పాటు భారతదేశంలో కళాశాల పక్షాన ప్రతినిధిగా కూడా వ్యవహరించారు. అలాగే, రియాధ్‌లో గుర్తింపు పొందిన భారతీయ ఉపాధ్యాయులలో మలార్‌ ఒకరు. వీరి కుటుంబం తొలుత చిత్తూరు జిల్లా నుంచి వలస వెళ్లి తమిళనాడులోని మధురైలో స్థిరపడింది. అనంతరం ఉపాధి కోసం కుటుంబ సమేతంగా సౌదీకి వెళ్లారు.