తల్లిదండ్రులకు తమ పిల్లల కంటే మరేదీ ఎక్కువ కాదని గ్రహించలేకపోయాడేమో ఆ అబ్బాయి. కడుపున పుట్టిన బిడ్డల కోసం తమ ప్రాణాలను సైతం పణంగా పెడతారన్న సంగతి మర్చిపోయాడేమో. అందుకే ఆ తల్లిదండ్రులకు పుత్రశోకం మిగులుస్తూ ఆత్మహత్య చేసుకున్నాడు. హైదరాబాద్‌లోని బహదూర్‌పురా పీఎస్ పరిధిలో ఈ విషాదం చోటు చేసుకుంది.
అమ్మానాన్న.. నన్ను క్షమించండి. నాకు హార్ట్‌లో ప్రాబ్లమ్ ఉంది. వైద్యం ఖర్చుల కోసం మిమ్మల్ని ఇబ్బంది పెట్టలేక ఆత్మహత్య చేసుకుంటున్నాను. మీరంటే నాకు చాలా ఇష్టం. నా ఫోన్ అమ్మండి. ఆ వచ్చిన డబ్బుతోనే అంత్యక్రియలు నిర్వహించండి. అప్పుడే నా ఆత్మకు శాంతి జరుగుతుందంటూ ఓ పదిహేడేళ్ల బాలుడు ఆత్మహత్యకు ముందు లేఖ రాసి పెట్టి మనస్తాపంతో ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కుమారుడిని ఆ స్థితిలో చూసిన ఆ తల్లి..గుండెలవిసేలారోదించడం స్థానికులను కలచివేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.