వైద్యుల అవతారమెత్తిన విద్యార్థులు..మర్మాంగం తొలగింపు..అంతలోనే

0
89

ఏపీలో దారుణం చోటు చేసుకుంది. నెల్లూరులోని ఓ లాడ్జిలో యూట్యూబ్ చూసి లింగ మార్పిడి ఆపరేషన్ చేసిన ఘటన విషాదాన్ని మిగిల్చింది. లింగ మార్పిడి ఆపరేషన్ లో భాగంగా మర్మాంగాన్ని తొలగించిన తర్వాత తీవ్ర రక్తస్రావం జరిగి ఓ వ్యక్తి మరణించిన ఘటన స్థానికంగా కలకలం రేపింది.

వివరాల్లోకి వెళితే..నెల్లూరు జిల్లా కేంద్రం నెల్లూరులో ఇద్దరు బీ-ఫార్మసీ విద్యార్థులు వైద్యుల అవతారమెత్తారు. ఓ లాడ్జి గదిని ఆపరేషన్ థియేటర్ గా చేసుకుని లింగమార్పిడి శస్త్రచికిత్స మొదలుపెట్టారు. ఈ క్రమంలో తీవ్ర రక్త స్రావమై పల్స్ డౌన్ కావడంతో ఓ ట్రాన్స్ జెండర్ మృతి చెందాడు.

ప్రకాశం జిల్లా జరుగు మల్లి మండలం కామేపల్లికి చెందిన బి. శ్రీకాంత్ అలియాస్ అమూల్య(28) చిన్న తనం నుంచే హైదరాబాద్లో తాపీపనికి వెళ్లే వాడు. అతడికి 2019లో మేనమామ కుమార్తె తో వివాహమైంది. వారు 2020లో విడాకులు తీసుకున్నారు. అప్పటినుంచి శ్రీకాంత్ ఒంగోలులో ఉంటున్నాడు. అక్కడే అతడికి విశాఖపట్నానికి చెందిన ట్రాన్స్ జెండర్ మోనాలిసా అలియాస్ జి.అశోక్తో పరిచయమైంది. ఇద్దరు స్నేహితులయ్యారు. వివిధ ప్రాంతాలకు తిరుగుతుండేవారు. ఆరునెలల కిందట శ్రీకాంత్ కు సోషల్ మీడియా యాప్ ద్వారా నెల్లూరులోని ఓ ప్రైవేట్ కళాశాల బీ-ఫార్మసీ విద్యార్థులు ఎ.మస్తాన్, జీవాతో పరిచయమైంది.

ఈ క్రమంలో శ్రీకాంత్ తాను ముంబై వెళ్లి లింగమార్పిడి శస్త్రచికిత్స చేయించుకుంటానని మస్తాన్కు చెప్పాడు. అయితే ముంబైలో ఆపరేషన్ చేసుకోవాలంటే బాగా ఖర్చుతో కూడుకున్న పని అని, తక్కువ ఖర్చుతో తానే చేస్తానని మస్తాన్ చెప్పాడు. దీంతో అందరూ కలసి ఈ నెల 23న నెల్లూరు గాంధీబొమ్మ సెంటర్లోని ఎస్ఎస్ లాడ్జిలో గదిని అద్దెకు తీసుకున్నారు. 24న మస్తాన్, జీవా.. మోనాలిసా సహాయంతో శ్రీకాంత్ కు శస్త్రచికిత్స ప్రారంభించి మర్మాంగాన్ని తొలగించారు.

దీంతో శ్రీకాంత్ కు తీవ్ర రక్తస్రావమై, పల్స్ పడిపోయింది. మోతాదుకు మించి మందులు వాడటంతో కొద్దిసేపటికే శ్రీకాంత్ మృతి చెందాడు. ఈ విషయాన్ని గమనించిన లాడ్జి సిబ్బంది చిన్నబజారు పోలీ సులకు సమాచారమందించారు. మృతుడి వద్ద లభ్యమైన ఆధారాలతో అతడి సోదరి పల్లవికి పోలీసులు సమాచారం అందించి, మృతదేహాన్ని జీజీహెచ్ మార్చురీకి తరలిం చారు. నెల్లూరు చేరుకున్న పల్లవి దీనికి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని చిన్నబజారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇప్పటికే పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని విచారి స్తున్నట్లు సమాచారం.