ఫ్లాష్ న్యూస్- తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు

Telangana High Court sensational verdict

0
91

తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. బాధిత బాలిక పిండాన్ని తొలగించాలంటూ కోఠి ప్రసూతి ఆసుపత్రి సూపరింటెండెంట్‌ను ఆదేశించింది. అబార్షన్ సమయంలో అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. అత్యాచారానికి గురై గర్భం దాల్చిన 16 ఏళ్ల బాలిక విషయంలో కోర్టు ఇచ్చిన ఈ తీర్పు ఇప్పుడు సంచలనంగా మారింది.

సమీప బంధువు ఒకరు అత్యాచారం చేయడంతో బాలిక గర్భం దాల్చింది. అబార్షన్ చేయాలని కోరగా, కోఠి ఆసుపత్రి వైద్యులు నిరాకరించారు. దీంతో బాధిత బాలిక తల్లి ద్వారా హైకోర్టును ఆశ్రయించింది. విచారించిన హైకోర్టు బాలిక ఆరోగ్య పరిస్థితిపై కమిటీ వేయగా..పరీక్షలు జరిపిన వైద్యులు ఆమె గర్భంలో 25 వారాల వయసున్న పిండం ఉన్నట్టు నిర్ధారించారు. కొన్ని జాగ్రత్తలతో అబార్షన్ చేయవచ్చని కోర్టుకు కమిటీ తెలిపింది.

బాలికకు అనుకూలంగా హైకోర్టు తీర్పునిస్తూ..నిపుణుల పర్యవేక్షణలో అన్ని జాగ్రత్తలు తీసుకుని అబార్షన్ చేయాలని జస్టిస్ బి.విజయ్‌సేన్‌రెడ్డి కోఠి ఆసుపత్రి సూపరింటెండెంట్‌ను ఆదేశించారు. ఓ దురదృష్టకర ఘటన కారణంగా వచ్చిన అవాంఛనీయ గర్భాన్ని తొలగించకపోతే అది ఆ బాలికపై తీవ్ర మానసిక, శారీరక ఒత్తిడి కలిగించి ఆరోగ్యంపై ప్రభావం చూపే అవకాశం ఉందని న్యాయస్థానం అభిప్రాయపడింది.

చట్ట ప్రకారం 24 వారాలకు మించి వయసు ఉన్న పిండం తొలగింపునకు ఆదేశాలు ఇచ్చే అధికారం రాజ్యాంగ కోర్టులకు ఉందని తెలిపింది.  పిండం నుంచి రక్తం, కణజాలం, డీఎన్ఏ సేకరించి ఫోరెన్సిక్ లేబొరేటరీకి పంపించాలని తెలిపింది. ఫోరెన్సిక్ లేబొరేటరీ నివేదికలు వచ్చిన తర్వాత..కేసు దర్యాప్తు చేస్తున్న అధికారులకు పంపించాలని తీర్పులో పేర్కొంది.