తెలంగాణ: మంచిర్యాల జిల్లాలో కలకలం రేగింది. రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్ పరిధి బిజోన్ ఆర్కే4 గడ్డ ప్రాంతంలో సోమవారం జరిగిన హత్యతో స్థానికులు ఉలిక్కిపడ్డారు. బెల్లపల్లి ఏసీపీ ఎడ్ల మహేష్ తెలిపిన వివరాల ప్రకారం ఆర్కే4 గడ్డలో దామ మహేందర్ నివాసం ఉంటున్నాడు.
సోమవారం మద్యం సేవించి అదే కాలనీలో నివాసం ఉంటున్న కుదుర్ల సంతోష్, శ్రీనివాస్ ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులతో అసభ్యకరంగా ప్రవర్తించాడు. దీనిని మనసులో పెట్టుకొని పథకం ప్రకారం కళ్ళలో కారం చల్లి గొడ్డలి, కత్తులతో దాడి చేయగా మహేందర్ అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిపారు. మృతుడు సింగరేణి ఉపరితల గనిలో కాంట్రాక్టు కార్మికుడిగా విధులు నిర్వహిస్తున్నాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తులో పూర్తి వివరాలను వెల్లడిస్తామని ఏసీపీ పేర్కొన్నారు.