కేరళ నుంచి అసోంకు వెళ్తున్న ప్రైవేటు బస్సులోని ప్రయాణికుల సామాన్లు, డబ్బులతో పరారైన డ్రైవర్ పోలీసులకు దొరికిపోయాడు. ఈ నెల 5న ఉడాయించిన డ్రైవర్, క్లీనర్..ఎట్టకేలకు పోలీసులకు చిక్కారు. వారి నుంచి ప్రయాణికులు లగేజీతో పాటు 18 సెల్ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
కేరళలో పనులు చేసుకొని పండుగ వేళ స్వగ్రామాలకు వెళ్లాలనుకున్నారు వలస కూలీలు. వారంతా… బిహార్, బెంగాల్, నేపాల్, అసోంకు చెందినవారు. ఏజెంట్ ద్వారా ఒక్కొక్కరు 3 వేల 500 రూపాయలు చెల్లించి ప్రైవెేటు ట్రావెల్స్‌లో బస్సు టికెట్లు బుక్ చేసుకున్నారు. కానీ ఈ నగదుతో బస్సు ఓనర్లు సంతృప్తి పళ్లేదు. అంత దూరం వెళ్తే తమకు ఏమీ లాభం లేదనుకున్నారు. కూలీలను మధ్యలోనే వదిలేయాలని మోసపూరిత ఆలోచన చేశారు. ఈ నెల 3 తారీఖున కేరళ నుంచి అస్సాంకు 64 మంది ప్రయాణికులతో ప్రైవేటు ట్రావెల్స్‌కు చెందిన బస్సు బయలుదేరింది. రెండు రోజుల ప్రయాణం తర్వాత.. 5న నల్గొండ జిల్లా నార్కట్‌పల్లికి బస్సు చేరుకుంది. బస్సు ఓనర్లు అనుకున్నట్టే నార్కట్‌పల్లి శివారులో జాతీయ రహదారిపై ఓ హోటల్ వద్ద అల్పాహారం కోసం బస్సును ఆపారు. ప్రయాణికులంతా తినేందుకు కిందకు దిగారు. ఇదే అదునుగా భావించిన డ్రైవర్, క్లీనర్ ప్రయాణికుల లగేజీతో ఉడాయించారు.
వెంటనే ప్రయాణికులు నార్కట్‌పల్లి పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేశారు. నార్కట్‌పల్లి సీఐ శంకర్ రెడ్డి, ఎస్సై యాదయ్య.. కేరళ వెళ్లారు. నిందితులను గుర్తించి వారిని నార్కట్‌పల్లికి తరలించారు. ఫోన్ స్విచ్ ఆఫ్ చేయటం వల్ల డ్రైవర్‌ను పట్టుకోవటం పోలీసులకు సమస్యగా మారింది.