కొడుకు కర్కశత్వం..ఓ కన్నతల్లి ఆవేదన ఇది!

0
149

ఈ సృష్టిలో అమ్మను మించిన దైవం లేదంటారు. నవమాసాలు మోసి కని పెంచిన బిడ్డలను కంటికి రెప్పలా కాపాడుకుంటుంది అమ్మ. ఎల్లప్పుడూ తన బిడ్డల యోగక్షేమాలనే కోరుకుంటుంది. వారు పెద్దై ఉన్నత స్థాయికి ఎదిగితే చూడాలనే కోరిక ఏ అమ్మకైనా ఉంటుంది. కానీ కొంతమంది పుత్రులు కన్నతల్లిపై కర్కశంగా ప్రవర్తిస్తున్నారు. కొంతమంది తల్లిని దూరంగా ఉంచగా మరికొంతమంది ఆశ్రమంలో చేర్పిస్తున్నారు. తాజాగా ఏపీలో హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది.

పల్నాడు జిల్లా క్రోసూరు మండలం గుడిపాడులో కన్నతల్లిపై అమానుషంగా దాడి చేశాడు ఓ సుపుత్రుడు. తనకు చెందిన స్థలంలో తల్లి అశ్రబీ మరుగుదొడ్డి నిర్మాణం చేపట్టిందని ఆమె కుమారుడు ఈసూబు ఆగ్రహం వ్యక్తం చేశాడు. అంతటితో ఆగకుండా తల్లిపై దాడి చేసి.. మరుగుదొడ్డి కోసం నిర్మాణం చేపట్టిన గుంతలో పడేశాడు. అడ్డుకోబోయిన కుటుంబసభ్యులను సైతం బెదిరించాడు. కుమారుడు ప్రవర్తనకు నిరసనగా..అక్కడే అదే గుంతలో తల్లి అశ్రబీ నిరసనకు దిగింది. తన కుమారుడి నుంచి తనకు రక్షణ కల్పించాలని వేడుకుంది.

ఇలాంటి ఘటనలు మానవత్వానికే మచ్చ తెస్తున్నాయి. కన్న తల్లి పట్ల ఇంతటి అమానుషాన్ని ప్రవర్తించిన కొడుకుపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. ఆస్తుల కోసం, భూముల కోసం తల్లిదండ్రులను హింసిస్తున్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే అధికారులు జోక్యం చేసుకోవాలని కోరుతున్నారు స్థానికులు.