ఏపీలో అన్నదాతల ఆత్మహత్యలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. గత ఏడాదితో పోల్చుకుంటే ఏపీలో 19.79 శాతం రైతుల ఆత్మహత్యలు పెరిగాయని ప్రమాద, మరణాలు ఆత్మహత్యల సమాచార నివేదిక 2021 వెల్లడించింది. దీనితో దేశంలో రైతుల ఆత్మహత్యల్లో ఏపీ 3వ స్థానంలో ఉంది.
2020లో 889 మంది బలవన్మరణాలకు పాల్పడగా 2021లో 1,065 మంది ఆత్మహత్య చేసుకున్నారు. మహారాష్ట్ర, కర్ణాటకలు వరుసగా తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి. గతేడాది దేశవ్యాప్తంగా 10,881 మంది రైతులు, వ్యవసాయ కూలీలు ఆత్మహత్య చేసుకోగా వారిలో 1,065 (9.78 శాతం) మంది ఏపీ వారే ఉండటం కలవరం కలిగిస్తోంది. దీని ప్రకారం ఏపీలో రోజుకు సగటున ముగ్గురు రైతులు, రైతు కూలీలు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. జాతీయ నేర గణాంక సంస్థ ఆదివారం రాత్రి విడుదల చేసిన ‘ప్రమాద మరణాలు- ఆత్మహత్యల సమాచార నివేదిక-2021’ ఈ వివరాలను వెల్లడించింది.
ఆత్మహత్యకు పాల్పడినవారిలో 481 మంది రైతులు కాగా, 584 మంది రైతు కూలీలుగా ఉన్నారు. బలవన్మరణాలకు పాల్పడ్డ 481 మంది వ్యవసాయదారుల్లో 359 మంది సొంత భూమి ఉన్నవారే. 122 మంది కౌలుదారులు. దేశవ్యాప్తంగా 511 మంది కౌలురైతులు ఆత్మహత్య చేసుకోగా అందులో 122 (23.82) శాతం మంది ఆంధ్రప్రదేశ్ వారే. కౌలురైతులు అత్యధికంగా ఆత్మహత్యలకు పాల్పడుతున్న రాష్ట్రాల్లో మహారాష్ట్ర తర్వాత ఏపీయే ఉంది.