భద్రాద్రి కొత్తగూడెంలో దారుణం..కన్నతల్లినే కడతేర్చిన కసాయి కొడుకు

The son of a butcher who stabbed his mother

0
82

ఇంట్లో చిన్నవాడని తల్లి తన దగ్గరే ఉంచుకుంది. ఈ క్రమంలో మద్యానికి బానిసైన కొడుకు విచక్షణ కోల్పోయి..కుటుంబసభ్యులను వేధించసాగాడు. భార్యాపిల్లలు వదిలేసి వెళ్లినా వ్యసనాన్ని వీడలేదు. చివరకు కన్నతల్లిని సైతం కడతేర్చాడు ఓ కసాయి కొడుకు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రామచంద్రునిపేటలో ఈ దారుణం చోటు చేసుకుంది.

రామచంద్రుని పేట గ్రామానికి చెందిన కల్లూరి పగడమ్మకు ఇద్దరు కుమార్తెలు, ఆరుగురు కుమారులు. అందరికీ వివాహాలు కాగా వేరువేరుగా కాపురాలు చేసుకుంటున్నారు. చిన్న కుమారుడు నరసింహారావు తన భార్యాపిల్లలతో తల్లి వద్ద వుంటూ కొన్ని సంవత్సరాలుగా జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో మద్యానికి బానిసైన నరసింహారావు.. ప్రతిరోజూ తాగి వచ్చి ఇంట్లో గొడవ చేస్తుండేవాడు. అతని చేష్టలకు విసిగిన భార్య 6 నెలల క్రితం పిల్లలను తీసుకొని పుట్టింటికి వెళ్లిపోయింది.

అప్పటినుంచి ఇంకా విపరీతంగా మద్యానికి అలవాటుపడ్డాడు. నిన్న రాత్రి సమయంలో మద్యానికి డబ్బులు ఇవ్వమని తల్లితో గొడవపడ్డాడు. చంపితే కానీ డబ్బులు ఇవ్వదని అనుకొని పక్కనే ఉన్న రోకలి బండతో ముఖం మీద కొట్టి చంపాడు. మెడలో ఉన్న బంగారాన్ని తీసుకుని పారిపోయాడు. మృతురాలి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు దుమ్ముగూడ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం బంధువులకు అప్పగించినట్లు ఎస్సై రవికుమార్​ తెలిపారు.