చిన్న చిన్న విషయాలకు తీవ్రమైన నిర్ణయాలను తీసుకుంటూ క్షణికావేశంలో తమ ప్రాణాలను సైతం తీసుకుంటున్నారు. క్షణం పాటి ఆ ఆవేశం నిండు ప్రాణాన్ని బలితీసుకుంటుంది. దీనితో వారి కుటుంబాలకు తీరని వేదనను మిగిల్చి వెళ్తున్నారు. తాజాగా భర్త కుట్టిన జాకెట్ నచ్చలేదని భార్య ఏకంగా ప్రాణాలు తీసుకుంది. ఈ దారుణ ఘటన తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో చోటు చేసుకుంది.
హైదరాబాద్ లోని గోల్నాక తిరుమల నగర్ లో శ్రీనివాసులు, విజయలక్ష్మి దంపతులు నివాసం వుంటున్నారు. ఈ దంపతులకు ఇద్దరు పిలల్లు. శ్రీనివాస్ బైక్ మీద తిరుగుతూ ఇంటింటికి వెళ్లి చీరలు, బ్లౌజ్ మెటీరియల్ అమ్ముతుంటాడు. అంతేకాదు మరోవైపు ఇంట్లో టైలరింగ్ చేస్తుంటాడు.
శనివారం భార్య విజయలక్ష్మి కోసం శ్రీనివాస్ ఒక జాకెట్ కుట్టాడు. అయితే భర్త కుట్టిన జాకెట్ నచ్చక పోవడంతో విజయలక్ష్మి భర్తతో గొడవకు దిగింది. దీంతో భర్త నీకు నేను కుట్టిన జాకెట్ నచ్చక పోతే బ్లౌజ్ కుట్లు విప్పి నచ్చినట్టు కుట్టుకో అని చెప్పాడు. భర్త ప్రవర్తనతో మనస్తాపం చెందిన విజయలక్ష్మి ఇంట్లో ఫ్యాన్ కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.