బ్రేకింగ్ న్యూస్: తెలుగు అకాడమీ డిపాజిట్ల గోల్‌మాల్‌ కేసు..ముగ్గురు అరెస్ట్

Three members arrested in Telugu Academy deposit scam case

0
91

హైదరాబాద్‌ తెలుగు అకాడమీ డిపాజిట్ల గోల్‌మాల్‌ కేసులో సీసీఎస్ పోలీసులు శుక్రవారం ముగ్గురిని అరెస్టు చేశారు. యూనియన్‌ బ్యాంక్‌ మేనేజర్‌ మస్తాన్‌ వలీ, అగ్రసేన్‌ బ్యాంక్‌ మేనేజర్‌ పద్మావతి, ఏపీ మర్కంటైల్‌ క్రెడిట్‌ కోఆపరేటివ్‌ సొసైటీ లిమిటెడ్‌ ఉద్యోగి మొహినుద్దిన్‌లను సీసీఎస్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

కాగా, వీరు కోట్ల రూపాయల డిపాజిట్లను దారి మళ్లించినట్లు పోలీసులు గుర్తించారు. 330 కోట్ల రూపాయలను తెలుగు అకాడమీ 11 బ్యాంకుల్లోని 34 ఖాతాల్లో డిపాజిట్‌ చేసింది. ప్రధానంగా యూనియన్‌ బ్యాంక్‌, కెనరా బ్యాంకుల్లో డిపాజిట్లు ఉన్నట్లు అధికారులు తెలిపారు. బ్యాంకు అధికారుల పాత్రపై తెలుగు అకాడమీ ఫిర్యాదు చేసింది. దీనిపై సరైన పత్రాలు చూశాకే డిపాజిట్లు క్లోజ్‌ చేశామని బ్యాంకు ప్రతినిధులు పోలీసులకు తెలిపారు.

ఏపీ వర్తక సహకార సంఘం ఏర్పాటు చేసినట్లు లేఖ సృష్టించి అధికారుల సంతకాలు ఫోర్జరీ చేసినట్లు పోలీసులు గుర్తించారు. డిపాజిట్లు రద్దు చేయాలని అధికారుల పేర్లతో బ్యాంకులకు లేఖ రాశారు. కాగా, డిపాజిట్ల రద్దు వెనుక ఎవరి హస్తం ఉందనే కోణంలో సీసీఎస్‌ పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు.

నిధుల గోల్‌మాల్‌పై ఇప్పటికే త్రిసభ్య కమిటీ ఆధ్వర్యంలో విచారణ కొనసాగుతుంది. అకాడమీ ఉద్యోగులను సైతం సీసీఎస్‌ పోలీసులు విచారిస్తున్నారు.