ఛత్తీస్‌గఢ్‌తో పాటు దేశవ్యాప్తంగా పేరుగాంచిన అవిభక్త కవల సోదరులు ఆదివారం అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. బలోదాబజార్‌లోని ఖాండా గ్రామానికి చెందిన కవల సోదరులు శివనాథ్, శివరామ్‌లు మరణం అందరిని కలచివేసింది.
ఛత్తీస్‌గఢ్‌కు చెందిన అవిభక్త కవలలు శివరామ్, శివనాథ్ జ్వరంతో బాధపడుతూ ప్రాణాలు కోల్పోయినట్లు కుటుంబసభ్యులు చెబుతున్నారు. ఎంతో చురుగా ఉండే ఈ సోదరులు అకస్మాత్తుగా మృతిచెందటాన్ని గ్రామస్థులు నమ్మలేకపోతున్నారు. బలోదబజార్ జిల్లాకు చెందిన వీరు తమ శరీర ఆకృతి, చేసే పనులతో సామాజిక మాధ్యమాలు వేదికగా లక్షలాది ఫాలోవర్స్‌ను సంపాదించుకున్నారు. ముఖ్యంగా టిక్‌టాక్ వేదికగా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. ఇద్దరు పిల్లల మరణంతో గ్రామం మొత్తం శోకసంద్రంలో మునిగిపోయింది.
ఖైందా గ్రామంలో శివరామ్, శివనాథ్ 2000 సంవత్సరంలో జన్మించారు. ఒకే శరీరం, రెండు కాళ్లు, రెండు తలలు, నాలుగు చేతులతో ఉన్న వీరిని చూసేందుకు దేశంలోని చాలా ప్రాంతాల నుంచి జనం గ్రామానికి వచ్చేవారు. కవలల మృతిపై వెల్లువెత్తుతున్న అనుమానాలతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఇందులో భాగంగా వారి కుటుంబాన్ని అదుపులోకి తీసుకుని కొన్ని గంటలపాటు విచారణ చేపట్టారు. మృతదేహాలను పరిశీలించిన డాక్టర్ బీకే సోమ సాధారణ మరణమేనని చెప్పారు. అయితే.. పోస్ట్‌మార్టం చేయకపోవటం వల్ల అసలు కారణాలు ఇంకా వెల్లడి కాలేదు.