జర్నలిస్టు రఘు కు అండగా ఉంటామన్నారు జన సమితి అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరాం. గురువారం రామంతపూర్ లోని రఘు సతీమణిని గంజి లక్ష్మీ ప్రవీణని కలిసి ధైర్యం చెప్పారు. ప్రముఖుల సంతకాలు తో డిజిపి కి లేఖ రాస్తామన్నారు. అక్రమ కేసులతో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని మండిపడ్డారు. జర్నలిస్టుల పై అక్రమ కేసులు అంటే ప్రశ్నించే గొంతుకలను నొక్కి వేయడమే అన్నారు.
జర్నలిస్టులు, జర్నలిస్టు సంఘాలు రఘు అక్రమ అరెస్టు పై స్పందించాలని కోరారు. జర్నలిస్టు రఘు పై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేసి భేషరతుగా అతనిని విడుదల చేయాలని కోదండరాం విజ్ఞప్తి చేశారు. రఘుకు, రఘు కుటుంబానికి తెలంగాణ జన సమితి అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. రఘు విడుదల కోసం అహర్నిశలు కృషి చేస్తామని వెల్లడించారు. విద్యావేత్తలు, ప్రజాస్వామికవాదులు, సీనియర్ జర్నలిస్టుల సంతకాలతో కూడిన వినతిపత్రాన్ని రాష్ట్ర డిజిపి కి అందజేయనున్నట్లు ఆయన వెల్లడించారు.
జర్నలిస్టుల పై అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేసి జైలుకు పంపించమంటే ప్రశ్నించే గొంతులను నొక్కి వేయడం అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యాన్ని రక్షించడానికి ప్రజలు, ప్రజాస్వామిక వాదులు, మేధావులు కలిసి రావాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో గ్రేటర్ హైదరాబాద్ తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ఎం నరసయ్య, నల్లగొండ జిల్లా జన సమితి ప్రధాన కార్యదర్శి శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.