తెలంగాణలో జర్నలిస్ట్ కిడ్నాప్ : కలకలం

0
146

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో గురువారం ఒక జర్నలిస్ట్ కిడ్నాప్ ఘటన కలకలం రేపింది. తొలి వెలుగు అనే యూట్యూబ్ ఛానెల్ లో జర్నలిస్టు గా పనిచేస్తున్న రఘను ఉదయం 9 గంటల సమయంలో మల్కాజ్ గిరిలోని తన నివాసం వద్ద కొందరు గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు. రఘును తన నివాసం వద్దకు నెంబర్ ప్లేట్ లేని జీపులో వచ్చిన వ్యక్తులు తలకు ముసుగు కప్పి, చేతులు కట్టి బలవంతంగా జీపులోకి ఎక్కించి తీసుకువెళ్లారని రఘు కుటుంబసభ్యులు తెలిపారు. రఘును ఎత్తుకెళ్లడంపై కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు.

కోకాపేట, కాందిశీకుల భూమి, ఐకియా ముందున్న భూమి, ఐడిపిఎల్ భూముల రిజిస్ట్రేషన్లపై కథనాలను ప్రసారం చేస్తే కబర్దార్ అంటూ దుండగులు పెద్ద పెట్టున కేకలు వేస్తూ రఘును జీపులో తీసుకుపోయినట్లు తెలిసింది.

ఈ కిడ్నాప్ వెనుక ఎవరున్నారనేది ఇంకా తెలియరాలేదు. తొలి వెలుగు అనే వెబ్ సైట్, యూట్యూబ్ ఛానెల్ గత కొంత కాలంగా భూ ఆక్రమణలపై వరుస కథనాలు ప్రసారం చేస్తున్నాయి.

పోలీసులే ఎత్తుకెళ్ళారా?

రఘు కిడ్నాప్ ఘటనపై రకరకాల అనుమానాలు కలుగుతున్నాయి. మఫ్టీలో ఉన్న పోలీసులే రఘును ఎత్తుకెళ్ళారన్న ప్రచారం ఉంది. అయితే పోలీసులు ఇంకా ధృవీకరించలేదు. రఘు కిడ్నాప్ అనేది మీడియా గొంతు నొక్కేందుకే అని జర్నలిస్టు సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. తక్షణమే రఘును విడుదల చేయాలని సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు.