ఆయన స్వయాన ఎమ్మెల్యే. కానీ ఆయన చేసిన అమానుష పనికి మాత్రం మహిళలు శాపనార్థాలు పెట్టారు. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండల కేంద్రంలో బుధవారం మహిళలంతా బతుకమ్మ ఆడుతుండగా ఓ కారు ఆ బతుకమ్మలను తొక్కుతూ దూసుకెళ్లింది.
దీంతో బతుకమ్మలు చెల్లా చెదరయ్యాయి. ఆ కారు ఎవరిదో అని చూస్తే స్వయాన పరకాల టీఆర్ఎస్ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి వాహనం. ఆ సమయంలో ఆయన వాహనంలోనే ఉన్నారు. ఎమ్మెల్యే తీరును నిరసిస్తూ మహిళలు ఎమ్మెల్యే డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు.
గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం..ఆత్మకూరుకు వచ్చిన చల్లా ధర్మారెడ్డి అక్కడ సెంట్రల్ లైటింగ్‌ను లాంఛనంగా ప్రారంభించారు. అదే సమయంలో పోచమ్మ సెంటర్ వద్ద ఉన్న వేణుగోపాలస్వామి దేవాలయం ఎదుట మహిళలు బతుకమ్మలు పెట్టుకొని ఆడుకుంటున్నారు.
ఎమ్మెల్యే వస్తున్నారని, రోడ్డుపై నుంచి బతుకమ్మలు తీసివేయాలని మహిళలను ధర్మారెడ్డి అనుచరులు కోరారు. ఎంతో భక్తితో ఆడుకుంటున్న బతుకమ్మలను మధ్యలో తీసివేయలేమని మహిళలు తేల్చి చెప్పారు.
అక్కడే ఉన్న సర్పంచ్ పర్వతగిరి రాజు ఓ పక్క నుంచి ఎమ్మెల్యే కారు పోనివ్వండిని ప్రాధేయపడ్డా పోలీసులు, అనుచరులు వినిపించుకోలేదు. బతుకమ్మ ఆడుతున్న మహిళలను తోసేసి ఎమ్మెల్యే కారును బతుకమ్మల మీదుగా ముందుకు పోనివ్వడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.